గత మూడు నాలుగేళ్లలో తెలుగు చిత్రసీమ చాలా మారింది. స్టార్ సినిమాలకే కాదు… నవతరం హీరోలకూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కనీవినీ ఎరుగని వసూళ్లు అందిస్తున్నారు. ఓవర్సీస్లో అయితే సినిమా చిన్నదా, పెద్దదా అని చూడడం లేదు. నచ్చితే..నెత్తిన పెట్టుకొంటున్నారు. వన్ మిలినిన్ డాలర్ క్లబ్ అనేది చిన్న సినిమాలకూ ఈజీగానే సాధ్యం అవుతోంది. అందుకే నాని, శర్వానంద్, రాజ్ తరుణ్ లాంటి హీరోల ఖాతాలోనూ మంచి హిట్లు పడుతున్నాయి. నాని, రాజ్‌తరుణ్, శర్వానంద్, సాయిధరమ్ .. ఇలా యంగ్ హీరోల చుట్టూ నిర్మాతలు ప్రదక్షిణాలు చేయడానికి కారణం ఇదే.
అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఈమధ్య యువ హీరోలూ తప్పటడుగులు వేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ (విన్నర్), వరుణ్ తేజ్ (మిస్టర్), శర్వానంద్ (రాధ)లకు ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. నిఖిల్ సినిమా `కేశవ`కీ అంత మంచి రిపోర్ట్ రాలేదు. విష్ణు, మనోజ్‌లు వరుసగా ఫ్లాపులు తింటున్నారు. మరో ఒకట్రెండు ఫ్లాపులు తగిలితే… కెరీర్ లో వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది. సాయిధరమ్ తేజ్ ముందు నుంచీ కమర్షియల్ కథలకే పెద్ద పీట వేస్తున్నాడు. ప్రతీసారీ అది వర్కవుట్ అవ్వదని తేజూ తెలుసుకోవాలి. విన్నర్‌లాంటి కథకు ఎలా పడిపోయాడో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. వరుణ్ తేజ్‌కి గైడెన్స్ అవసరం అనిపిస్తోంది. టాలెంట్ ఉన్నా.. తనకు నప్పే కథల్ని ఎంచుకోవడంలో తడబడుతున్నాయి. ఎప్పుడూ కొత్త కథలు ఎంచుకొనే శర్వా… రాధలాంటి రొటీన్ కమర్షియల్ కథకు ఓటేస్తాడని ఎవ్వరూ ఊహించరు. మాస్‌ని మెప్పించాలన్న ప్రయత్నాల్లోంచి శర్వా బయటపడితే మేలు. వరుస విజయాలు అందుకొంటున్న నిఖిల్… అప్పుడప్పుడు ఓవర్కాన్ఫిడెన్స్తో తప్పులు చేస్తున్నాడు. దానికి శంకరాభరణం, కేశవ సినిమానే ఉదాహరణ. ఈ రెండూ మొహమాటానికి ఒప్పుకొన్న కథలని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మొహమాటాల వల్ల కెరీర్ నాశనం అవుతుందన్న నిజాన్ని నిఖిల్ గ్రహించాలి. ఇక మంచు సోదరులు ఎప్పుడు గాడిన పడతారో చెప్పలేని పరిస్థితి. ప్రేక్షకులు కొత్తదనానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ విషయాన్ని మంచు బ్రదర్స్ ఇంకా గుర్తించకపోవడం దురదృష్టం.
కొత్త కథలు రాజ్యమేలుతున్నాయి. కొత్త ప్రయత్నాలు, వినూత్న ప్రయోగాలకు కాసులు కురుస్తున్నాయి. ఈ దారిలో ప్రయాణించినప్పుడు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తప్పవు. వాటిని ఎదుర్కోవడానికి సిద్దపడాలి. కొత్తగా ఆలోచించినప్పుడు ఫ్లాప్ ఎదురైనా కొత్తగా ఏదో ట్రై చేశాం అన్న సంతృప్తి మిగులుతుంది. మిస్టర్, రాధ, విన్నర్‌లాంటి రొటీన్ కథలకు ఆ అవకాశమూ దక్కదు. సో.. కొత్త దారిలోనే వెళ్లండి… విజయాలు అందుకోండి. విజయోస్తు!!