తనయుడ్ని ప్రమోట్ చేసుకోవడం ఎలా? అనేది బెల్లంకొండ సురేష్‌ని చూసి నేర్చుకోవాలి. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రమోషన్లని ఆ రేంజులో చేస్తుంటారు. సినిమా బడ్జెట్ ఎంతో తెలీదు గానీ, ప్రచారాన్ని మాత్రం – పెద్ద హీరోలకు తీసిపోకుండా ఆర్భాటంగా చేస్తుంటారు. ఇప్పుడు చిత్రసీమలో మరో ‘బెల్లంకొండ’ లాంటి నిర్మాత కనిపించారు. ఆయనే… నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్. ఐరా క్రియేషన్స్ని ప్రారంభించి ‘ఛలో’తో ఓ సూపర్ హిట్టు కొట్టారు. నిజానికి ఆ సమయంలో శౌర్యకి ఓ మంచి విజయం అవసరం. ఆ లోటు ఐరా తీర్చేసింది. ఆ సినిమాకి ఆయన చేసిన ప్రమోషన్ హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు సేమ్ టూ సేమ్ ‘@ నర్తనశాల’కీ అదే ఫాలో అవుతున్నారు. ఆ మాటకొస్తే…. శౌర్య ప్రమోషన్లు ఇది వరకెప్పుడూ లేనంత జోరుగా సాగుతున్నాయి. ‘ఛలో’ తరవాత వచ్చిన ‘అమ్మమ్మగారి ఇల్లు’, ‘కణం’ ప్రమోషన్లు లేక డీలా పడ్డాయి. ‘అమ్మమ్మ గారి ఇల్లు’కి మంచి టాకే వచ్చినా, బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. దానికి కారణం… సరైన ప్రమోషన్లు లేకపోవడమే. అందుకే ఆ లోటు.. ‘నర్తన శాల’కు రాకూడదని జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్ల కోసమే రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాని ఏ స్థాయిలో ప్రచారం చేస్తారో, అదే స్థాయిలో నాగశౌర్య ప్రమోషన్లు సాగుతున్నాయి. నర్తన శాల టీజర్లకు, పాటలకు మంచి బజ్ వచ్చింది. టైటిల్ కూడా టెమ్టింగ్‌గా ఉంది. అయితే ప్రస్తుతం ‘గీత గోవిందం’ హవా నడుస్తోంది. వీటి మధ్య ‘నర్తన శాల’ సౌండింగ్ వినిపించాలంటే ఈ స్థాయిలో ప్రమోషన్లు చేయాల్సిందే. ఈనెల 30న ‘నర్తన శాల’ విడుదల అవుతోంది. రిలీజ్ కి పదిహేను రోజుల ముందుగానే హడావుడి మొదలెట్టేశారు. 24న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ‘ఛలో’ కోసం చిరంజీవిని తీసుకొచ్చి.. ప్రమోషన్లకు హైప్ తీసుకొచ్చిన నాగ శౌర్య.. ఈసారి ఏ స్టార్‌ని లాక్కొస్తారో చూడాలి.