కరోనాకి ఎదురొడ్డుతోంది ప్రపంచం. ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి. కాస్తో కూస్తో సంపాదించుకున్నవాళ్లు, మధ్యతరగతి ప్రజల జీవితాలు ఫర్వాలేదు. ఏ రోజుకారోజు అంటూ కడుపు నింపుకునే వాళ్ల పరిస్థితే దుర్భరంగా తయారవుతోంది. వీళ్ల కాలే కడుపుల ఆకలి చాల్లారచ్చడం అందరి బాధ్యత. అందుకు ఎవరికి తోచిన దారిని వాళ్లు ఎంచుకుంటున్నారు. చిత్రసీమ కూడా ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సీసీసీ అంటూ ఓ సంస్థని స్థాపించి, విరాళాలు సేకరించి, నిరు పేద కార్మికుల కడుపు నింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సీసీసీకి భారీ మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. వాటితో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయంపై సినిమా పెద్దలు, సీసీసీ కార్యవర్గం తర్జన భర్జనలు పడుతోంది.
అయితే ఈ సీసీసీ వెనుక రాజకీయ కోణాన్ని వెలికి తీసే పనిలో కొంతమంది పెద్దలు తలమునకలు అవ్వడం ఆశ్చర్యాన్ని, ఆందోళననీ కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించడం ఇష్టం లేకపోవడం వల్లే చిత్రసీమ సీసీసీ పేరుతో విరాళాల్ని అటు వైపుకు మళ్లిస్తోందని కోడి గుడ్డుపై ఈకలు పీకే కార్యక్రమంలోకి దిగింది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే గనుక ఈపాటికే ఇబ్బుడి ముబ్బుడిగా విరాళాలు ప్రకటించేవారని లాజిక్కులు తీస్తోంది. నిజానికి ఇప్పటికే స్టార్లు తమ విరాళాల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించేశారు. వాటికి ప్రకటించిన తరవాతే.. ఇప్పుడు సీసీసీకి కూడా కొంత మొత్తం అందించడానికి ముందుకొచ్చారు. జగన్ అంటే ఇష్టం లేకపోవడం వల్లే.. విరాళాల్ని సీసీసీకి మళ్లించారు అనుకొంటే, అలాంటి వాళ్లకు కేసీఆర్ అన్నా కూడా ఇష్టం లేనట్టే కదా? సీసీసీకి విరాళాలు ఇవ్వడం కేసీఆర్పై వ్యతిరేకత అని కూడా అనుకోవాలా? నిజానికి ఇది అర్థం లేని వాదన.
చిత్రసీమలో కార్మికుల గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకొన్న పాపానికి పోలేదు. వాళ్లు ఆంధ్రాకి చెందిన వాళ్లా? తెలంగాణలో భాగస్వాములా? అనేది ఎప్పటికీ తేలని ప్రశ్న. వాళ్లని ఓటు బ్యాంకుగా కూడా ఎవ్వరూ పరిగణించడం లేదు. ఓ విధంగా ఏ ప్రభుత్వానికీ కానివాళ్లుగా మారిపోయారు. అలాంటి వాళ్లని కనీసం సినిమా పరిశ్రమ కూడా పట్టించుకోకపోతే ఎలా? అందుకే సీసీసీ ఆవిర్భవించింది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమ బాబోగుల గురించి తామే ఆలోచించుకుంటున్నారు. ఏ ప్రభుత్వానికీ పట్టని సినీ కార్మికుల కడుపుల్ని వాళ్లే నింపుకుంటున్నారు. ఓ రకంగా ప్రభుత్వానికి పని తప్పించినవాళ్లయ్యారు, ఇది ఆహ్వానించదగిన పరిణామం. అభినందించాల్సిందిపోయి.. దాన్నీ రాజకీయం చేయడం ఏమిటో??