హైదరాబాద్: రాంచరణ్-శ్రీను వైట్ల తొలి కాంబినేషన్లో వస్తున్న ‘బ్రూస్లీ’ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ లేకపోయినా రాంచరణ్, శ్రీను వైట్లకు మాత్రం ఈ చిత్ర ఫలితం కీలకం. గత ఏడాది విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే’తో అంచనాలను అందుకోలేకపోయిన రాంచరణ్, ‘ఆగడు’తో కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్‌ను అందుకున్న శ్రీను వైట్ల ఇద్దరూ హిట్ కోసం కసిమీద ఉన్నారు. ముఖ్యంగా శ్రీనువైట్ల సర్వశక్తులూ ఒడ్డి ఈ చిత్రానికి కృషి చేస్తున్నారు. ఆగడు చిత్రం తనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, బ్రూస్లీని కొత్త ఫార్మాట్లో తీశానని ఆయన చెబుతున్నారు. తన పాత మిత్రులు కోన వెంకట్, గోపి మోహన్లతో కలిసిన తర్వాత చేస్తున్న మొదటి చిత్రం ఇదే కావటంతో టీమ్ మొత్తం తప్పనిసరిగా సబ్జెక్ట్‌పై బాగా కాన్సంట్రేట్ చేసి ఉంటారు. ఆగడులో మిస్ అయిన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, యాక్షన్‌ను మేళవించినట్లుగా ట్రైలర్లలో కనబడుతోంది. తమన్ సంగీతంకూడా బాగానే ఉంది. అసలు బాగా పాపులర్ అయిన బ్రూస్లీ అన్న పేరు టైటిల్‌గా పెట్టటం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దానికితోడు చిరంజీవి ఎనిమిదేళ్ళ తర్వాత తెరపై కనిపిస్తుండటం ప్రాజెక్ట్‌కు అదనపు ఆకర్షణగా మారింది. దసరా సెలవులు కావటం చిత్రానికి మరో ప్లస్ పాయింట్ అయింది. ఈ అంశాలన్నింటి దృష్ట్యా చిత్రం మినిమమ్ గ్యారంటీ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. హైప్ లేకపోవటంతో అంచనాలు తక్కువగా ఉంటాయి. సినిమా ఓ మాదిరి టాక్ వచ్చినా కలెక్షన్లలో దూసుకెళ్ళిపోవటం ఖాయం. ఇప్పటికే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చిందని, రు.56.45 కోట్లకు అమ్ముడు పోయిందని చెబుతున్నారు.
‘బ్రూస్లీ’ చిత్రం నిడివి146 నిమిషాలని తెలిసింది. దీనిలో చిరంజీవి 5 నిమిషాలు కనిపిస్తారట. ఇదిలా ఉంటే రాంగోపాల్ వర్మ తన ‘బ్రూస్లీ’ చిత్రం వీడియో సాంగ్‌ను నిన్న సాయంత్రం యూట్యూబ్‌లో రిలీజ్ చేయటం కొసమెరుపు.