జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పోరాటయాత్రకు ఓ దశదిశ లేకుండా పోయింది. ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వస్తారో..? ఎప్పుడు రిసార్ట్‌లో రెస్టు తీసుకుంటారో.. ఆయన సన్నిహిత అనుచరులకు కూడా తెలియడం లేదు. టూర్ షెడ్యూల్‌పై కూడా క్లారిటీ ఉండకపోవడం..ఆయన అనుచరులను కూడా గందరగోళానికి గురి చేస్తోంది. ఉత్తరాంధ్రలో 45 రోజుల పాటు.. నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పోరాటయాత్ర చేస్తానని పవన్ ప్రారంభంలో చెప్పారు. గత నెల ఇరవైన… ఇచ్చాపురం నుంచి.. యాత్రను ప్రారభించారు. పదహారు రోజుల కాలంలో ఆయన పోరాటయాత్ర చేసింది తొమ్మిదంటే తొమ్మిది రోజులు మాత్రమే. ఈ తొమ్మిది రోజుల్లోనే ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను చుట్టేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉత్సాహంగానే పోరాటయాత్రను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. తాను పార్టీ పెట్టిన నాలుగేళ్లలో శ్రీకాకుళం జిల్లాకు ఇది చేశానని చెప్పుకోవడానికి పవన్ కల్యాణ్ ఉద్దానం ఉంది. దాన్ని జిల్లా మొత్తం ఉపయోగించుకున్నారు. ప్రతి సభలోనూ.. ఉద్దానం విషయాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించారు. చివరకు.. ఆవేశంలో ఆరోగ్యమంత్రిని నియమించకపోతే.. ఆమరణదీక్ష చేస్తానని కూడా ప్రకటించారు. ఇలా ప్రకటించిన తర్వాత రిసార్ట్‌లో రెండు రోజులు సెలవు తీసుకుని మూడో రోజు.. దీక్ష చేశాననిపించారు. అసలు పోరాటయాత్రలో పవన్ ఏం చెప్పారన్నదాని కన్నా .. దాట్ల రిసార్ట్‌లో రెండు రోజుల పాటు పవన్ ఏం చేశారన్నదానినే ఎక్కువ చర్చ జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పర్యటన మ..మ అనిపించి.. బొబ్బిలి చేరుకున్నారు.
బొబ్బిలి చేరే వరకూ విజయనగరం జిల్లాలో పోరాటయాత్ర ఎలా సాగాలన్న క్లారిటీ కూడా లేదు. దాంతో రెండు రోజుల పాటు అనుచరులతో చర్చించి.. మూడు రోజుల్లో ఆ జిల్లాను పూర్తి చేసేశారు. విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి ఎలాంటి క్రెడిట్ లేదు. అక్కడా ఉద్దానం చెప్పుకుంటే కామెడీ అయిపోతుందని.. చంద్రబాబుపై ఆరోపణలకు సమయం కేటాయించారు. బొబ్బిలికి వెళ్లి అశోక్‌గజపతిరాజుకు చాలెంజ్ చేసి.. ట్రోలింగ్‌కు గురయ్యారు. ఆ తర్వాత అరకు చేరుకున్నారు. విజయనగరం జిల్లాలోకి ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు ఎంత గందరగోళం ఉందో విశాఖ జిల్లా అరకులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడూ.. పవన్లోఅదే కన్ఫ్యూజన్ ఉంది.
టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి నిపుణులైన నేతలు లేరు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఉన్న నేతలకు పవన్ ఏమీ చెప్పరు. దాంతో.. మొత్తం ఈవెంట్… పవన్ ఎప్పుడనుకుంటే అప్పుడే అన్నట్లు మారిపోయింది. అరకు రిసార్ట్‌లో బస చేసి మూడు రోజులైనా.. పోరాటయాత్ర గురించి ఎలాంటి క్లారిటీ లేదు. తొలి రోజు ఎవరితోనూ మాట్లాడని పవన్.. రెండో రోజు.. కొంత మంది యువకులతో సమావేశమై… ఖనిజాల గురించి తన విజ్ఞాన ప్రదర్శన చేశారు. సీఎం ఇంటి కింద తవ్వినా ఖనిజం వస్తుందని గొప్పగా చెప్పేశారు. ఆ తర్వాతి రోజు… గిరిజన గ్రామాలను సందర్శించి.. అక్కడి పరిస్థితులను చూసి అయ్యో పాపం అన్నారు.
ఈ పదహారు రోజుల పోరాటయాత్రను విశ్లేషిస్తే.. అసలు పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో ఈ రాజకీయ పర్యటన చేస్తున్నారో.. కనీసం ఆయనకైనా అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. పార్టీ నిర్మాణ ప్రయత్నాలైనా చేస్తున్నారా అంటే అదీ లేదు. తను ఓ సక్సెస్ టూర్‌కు వచ్చినట్లు వచ్చారు. సమయం రాగానే కుదిరితే కవాతు చేస్తున్నారు. లేకపోతే.. మరో కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఏదైనా మొత్తం పవన్ మూడ్ ప్రకారమే. ఆయన మూడ్ వారంలో నాలుగు రోజులు బాగుండదు అంతే..!!
— సుభాష్