రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ ముగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసం దాటవేతకు నిదర్శనంగానూ ఎదురుదాడికి నిర్వచనంగానూ ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిజెపి నేతలు తమ ప్రభుత్వ విధానాలను సమర్థించుకోవడం, పొరబాట్లను ఒప్పుకోవడం కంటే కాంగ్రెస్‌పై దాడి చేసి తప్పించుకోవడం ఎక్కువగా జరుగుతున్నది. హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను కుదిపేసిన వివాదాలపై మౌనం దాల్చడంలో ఈ దాటవేత స్పష్టమవుతుంది. గతంలో రోహిత్ వేముల భరత మాత ముద్దుబిడ్డ అని చెప్పిన ప్రధాని ఆ మాటలు కూడా మింగేశారంటే సంఘ పరివార్ ఎబివిపిల ఒత్తిడి ఎంత బలంగా వుందో తెలుస్తుంది. జెఎన్‌యు విషయంలోనైతే నేరుగా నోరువిప్పిందేలేదు. కాని సృతి ఇరానీ ప్రసంగం గొప్పగా వుందని సత్యమేవజయతే ట్వీట్ చేశారు ప్రధాని. తర్వాత ఆ ప్రసంగంలో అవాస్తవాలు వరుసగా బయిటకు రావడమే గాక జెఎన్‌యు విద్యార్థి సంఘాద్యక్షుడు కన్నయ్య కుమార్‌కు హైకోర్టు బెయిలు కూడా ఇచ్చింది. మరి తర్వాతనైనా ప్రధాని భరోసా కల్పించే విధంగా మాట్లాడవద్దా? రాష్ట్రపతి ప్రసంగంలో వలెనే తన సమాధానంలోనూ దాటేస్తే సరిపోతుందా? పోనీ తమ వారు మాట్లాడింది సరిగ్గా వుందనుకుంటే ఆ విషయమైనా చెప్పొచ్చు. కాని దాన్ని పూర్తిగా దాటేసి మౌనరేంద్రమోడీ బిరుదు సార్థకం చేసుకున్నారు.
అదలా వుంచితే చరిత్రను లేదా విషయాలను పొరబాటుగా ఉటంకించడం మోడీ ప్రధాని కాకముందే మొదలైంది. తక్షశిల పాకిస్తాన్లో వుంటే ఆయన బీహార్‌లో వుందన్నారు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశస్థాపకుడు కాగా మోడీ ఆయనను గుప్త వంశంలో చేర్చారు. అలెగ్జాండర్‌ను పురుషోత్సతముడు జీలం నది ఒడ్డున ఎదుర్కొంటే మోడీ గంగా తీరంలోకి తెచ్చారు. ప్రధాని ప్రసంగించేంది ఎర్రకోట మీదనుంచైతే మోడీ లాల్ దర్వాజా అని మరో పేరు చెప్పారు. శ్యామ్ కృష్ణవర్మకు తమ పార్టీ స్థాపకుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీతో గందరగోళపర్చారు. ఇలాటి పొరబాట్లు ఇంకా చాలా వున్నాయి. డాలరు రూపాయి మారకం విలువ గురించి జీడిపీ గురించి కూడా తోచిన లెక్కలు చెప్పారు. ఆఖరుకు జాతిపిత గాంధీజి పేరును కూడా మోహన్‌దాస్ కరమ్ చంద్ అని గాక మోహన్‌లాల్ అని చదివి ఆశ్చర్యపరిచారు. ఎవరైనా మాట్లాడేప్పుడు పొరబాటు పడతారు గాని ఇంత జాబితా తయారైందంటే నిర్లక్ష్యం అని చెప్పకతప్పదు.
తాజా ప్రసంగంలోనూ ప్రధాని ఇలాటి పొరబాటే చేశారు. తనను విమర్శించేవారిని సహించలేకపోతున్నానని వచ్చే వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ ి స్టాలిన్ కృశ్చెవ్ల ఉదాహరణ తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి చాలా అవాస్తవాలు ప్రచారంలో వున్నాయన్నది తెలిసిందే. అలా అమితంగా ప్రచారంలో వున్న ఒక కథ ఏమంటే కృశ్చెవ్ స్టాలిన్ మరణానంతరం విపరీతంగా దాడి చేస్తుంటే వెనకనుంచి ఎవరో ఆయన బతికున్నప్పుడు ఏం చేశావ్? అని కేకేశాడల. ఎవరది అని అడిగితే ఎవరూ లేవలేదు. ‘నేనూ ఇదే చేశాను’ అని కృశ్చెవ్ జోకు వేశాడని కథ.(నిజానికి స్టాలిన్‌ను అతిగా పొగడ్డం మొదలు పెట్టిందే కృశ్చెవ్) ఈ కథలో కృశ్చెవ్ స్వభావంపై విసురు వుంది. మోడీ ఈ కథను తప్పుగా విన్నారో లేక పొరబాటుగా చెప్పారో తెలియదు. గాని అలవాటులో పొరబాటుగా వుంది. అందులోని రాజకీయ చమత్కారమూ మాయమైంది.
ఈ దేశంలో అవినీతి పెరుగుదలకూ ఇంకా అనేక అనర్థాలకు కాంగ్రెస్ బాధ్యతను ఎవరూ తప్పించలేరు. అందుకే ఇప్పటికి చాలా సార్లు వారిని ప్రజలు ఓడించారు. రాహుల్ గాంధీ కూడా చాలా సార్లు అవకతవకగా వ్యవహరించారు. వారిని బిజెపి నేతలు ఎన్ని విమర్శించినా అభ్యంతరం లేదు. కాని తమ నిర్వాకాలకు విధానాలకు తాము బదులు చెప్పవలసింది పోయి కాంగ్రెస్‌ను అవహేళన చేస్తే సరిపోతుందా? ఈ క్రమంలోనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటూ (ఆత్మన్యూనతా భావన) విచిత్రమైన వాదన చేశారు. ఎప్పుడూ తాను కిందనుంచి వచ్చానని చెప్పుకుంటూ మరోవైపున కీలక సందర్భాలలో జిగేల్మనే దుస్తులతో వెలిగిపోయే మోడీ తత్వాన్ని మనస్తత్వ వేత్తలు సులభంగానే విశ్లేషించగలరు. గుజరాత్ మారణకాండ సమయంలో ఆయన మాట్లాడిన తీరులోనూ తర్వాత ఆ సాక్ష్యాధారాల తారుమారు ప్రక్రియ అమలు చేయడంలోనూ అభద్రత తొంగిచూస్తుంది. ప్రతిపక్షాల సంగతి అటుంచి స్వపక్షంలోనే ప్రత్యర్థులైన సంజరు జోషి నుంచి కురువృద్ధులైన అద్వానీ మురళీ మనోహర్ జోషి వరకూ మోడీ ఎలా చూస్తున్నది దేశమంతటికీ తెలుసు. దీన్ని ఏ కాంప్లెక్సు అంటారో చెప్పనవసరం లేదు. భార్యతో కలసి వుండటం విడిపోవడం తన ఇష్టమైనా ఆ విషయమై బాధ్యతాయుతమైన సమాధానం కూడా ఇవ్వక పోవడం మరింత వ్యక్తిగత మనస్తత్వ సూచిక.