ఐదేళ్లలో కందిపప్పు ధరలు నాలుగురెట్లు, బియ్యం ధరలు రెండున్నర రెట్లు పెరగడం ‘ప్రపంచీకరణ’ కు ఒక పర్యావసానం. వర్ధమాన దేశాలు వాటికి తెలియకుండానే ఒక మాయలో పడిపోవడం, లేదా మాయ తెలిసీ తప్పించుకోలేకుండా ఇరుక్కుపోవడం జరుగుతోంది. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడమో, వ్యవసాయ భూమి విస్తీర్ణం కుంచించుకు పోవడమో జరుగుతోంది.
సూడాన్ మొదలైన ఆఫ్రికా దేశాలలో అమెరికా, చైనా సంస్థలు లక్షలాది ఎకరాల్లో ‘ఇంధనం మొక్కలు’ మాత్రమే పెంచుతున్నారు. ఈ గ్రీన్ ఫ్యూయల్ ఫలితంగా ఆఫ్రికా దేశాల్లో స్ధానిక, సహజ, స్వాభావిక పంటలు అంతరించిపోయాయి. దీంతో ఆదేశాలకు నిరంతరం ఆహార ధాన్యాలను ఎప్పుడూ దిగుమతి చేసుకుంటూనే వుండవలసిన పరిస్ధితి దాపురించింది!
అంతెందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరగబోయేదికూడా ఇదే! ఆ ప్రాంతంలో వరి, చెరకు కంది, అరటి,మామిడి వంటి వాటివల్ల సహజ హరిత శోభ ఏర్పడుతోంది, ఆహారపదార్ధాలు కూడ ఉత్పత్తి అవుతున్నాయి. కానీ 33 వేల ఎకరాల్లో స్వాభావికమైన పచ్చదనాన్ని ధ్వంసం చేసి ‘పార్కులు’ పేరుతో ‘గార్డెన్స్’ పేరుతో పిచ్చిమొక్కలను పెంచడం వల్ల కృత్రిమ హరిత శోభ నెలకొనవచ్చు.కానీ కందిపప్పు, బియ్యం మాత్రం అక్కడ ఎప్పటికీ పండవు..
బిటి పత్తి వల్ల ఎక్కువ రాబడులు వుంటాయన్న ఆశతో స్వాభావిక సహజ పంటఅయిన కంది సాగును వదిలేసిన మహారాష్ట్ర, తెలంగాణ,కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పదేళ్ళక్రితమే ప్రపంచీకరణ మాయలో మునిగిపోయాయి.
మనిషైనా దేశమైన స్వవలంబనను కోల్పోయాక ఇతరుల చెప్పుచేతల్లో వుండకతప్పదు. కందిపప్పు ధరలు పెరగడానికి ముందుగా మిరియాల ధరలు భయంకరంగా పెరిగిపోయాయి. కందిపప్పు ధరలు పెరిగిన తరువాత మిరపకాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉల్లి ధరలు పెరగడం తగ్గడం తాత్కాలిక పరిణామం అని అనుకుంటున్నా వంద శాతం పెరుగుదల ఆ తరువాత ముప్పయి శాతం నుండి యాబయి శాతం వరకు మాత్రమే తగ్గడమే అసలు పరిణామం!దీర్ఘకాలంలో అన్ని ఆహార పదార్ధాలు,ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్ల ధరల సగటు పెరుగుదల ఇలాగే వుంటుంది.
కిరాణా దుకాణాలను సూపర్ మార్కెట్లు మింగేశాయి. సూపర్ మార్కెట్లను మోర్, జెయంట్, డిమార్ట్, మెగాస్టోర్ వంటి మెగా స్టోర్లు మింగేశాయి…తక్కువ ధర కే సరుకు అమ్ముతున్న ఈ మెగా స్టోర్లు – ఇతర మార్కెటింగ్ వ్యవస్ధలు ధ్వంసమయ్యాక విశ్వరూపాన్ని చూపిస్తాయి. వాటి ధరల్ని ప్రభావితం చేసే పరోక్ష లేదా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులే అంతిమంగా మనం ఏసరుకు ఏధరకు కొనాలో నిర్ణయిస్తాయి.
ప్రస్తుత సమస్య అయిన కందిపప్పు విషయాన్నే విశ్లేషిస్తే 2014-15 పంట ఏడాదిలో 17.38 మిలియన్ టన్నుల పప్పులు దిగుబడి నమోదయ్యింది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 9.5 శాతం తక్కువ ఉత్పత్తి. ఏటా భారతదేశంలో 21 మిలియన్ టన్నుల డిమాండ్ ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటకలో దిగుబడి పడిపోయింది. ఉత్పత్తిలో స్వల్పంగానే తగ్గుదల చోటు చేసుకున్నప్పటికీ నల్లబజార్లో దాచేయడంతో సరఫరాలో తీవ్ర అంతరం నెలకొంది. దీంతో కృత్రిమంగా ధరలు పెరిగాయి.
2007లో కందిపప్పు ధరలు భయంకరంగా పెరిగే వరకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆతరువాత ఆస్ట్రేలియా నుండి కందిపప్పును దిగుమతి చేసుకొనడానికి ప్రయత్నించింది. కానీ మన దేశంలో కంది కొరత ఏర్పడిపోయిందని అంతర్జాతీయంగా అప్పటికే ప్రచారమైంది. అందువల్ల ఆస్ట్రేలియా సంస్థలు మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు సైతం కందిపప్పు ధరలను పెంచాయి. ఆ పెరిగిన ధరలకు మనం కంది గింజలను కొనుక్కోవలసి వచ్చింది. భారీ ప్రమాణంలో మన ప్రభుత్వం కందిపప్పును దిగుమతి చేసుకున్నప్పటికీ అందువల్ల కందిపప్పు ధరలు తగ్గలేదు. ఈ కథ ఇప్పుడు పునరావృత్తం అవుతోంది.