మలయాళ రీమేక్‌లపై టాలీవుడ్ మొదట్నుంచీ దృష్టి పెడుతూనే ఉంది. అక్కడ ఓ మంచి సినిమా వస్తే.. దాన్ని రీమేక్ రూపంలో తెలుగు ప్రేక్షకులకు అందించడం అలవాటే. అయ్యప్పనుమ్ కోషియుమ్ ని తెలుగులో రీమేక్ చేయడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. బాలకృష్ణ ఇందులో కథానాయకుడిగా నటిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌పై కూడా ఓ టాప్ హీరో దృష్టి పెట్టాడని సమాచారం. ఫృథ్వీరాజ్, సూరజ్ కథానాయకులుగా నటించిన చిత్రమిది. ఓ సూపర్ స్టార్కీ, పోలీస్ అధికారికీ మధ్య నడిచే ఈగో క్లాష్. రెండు నెలల క్రితమే.. డ్రైవింగ్లైసెన్స్ తెలుగులో రీమేక్ చేస్తారని ప్రచారం మొదలైంది. మొదట్లో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెలుగు నిర్మాతలు కాస్త హడావుడి చేశారు. అయితే ఆ తరవాత అది కాస్త సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా రీమేక్ పై దృష్టి పెట్టారని సమాచారం. ఓ అగ్ర కథానాయకుడు ఈ సినిమాని చేయడానికి ఆసక్తి చూపించడంతో ఒకరిద్దరు నిర్మాతలు రీమేక్ రైట్స్ విషయంలో ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆ వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి వస్తే… మిగిలిన విషయాలు బయటకు వస్తాయి.