మావోయిస్టు ఉద్యమంలో ఉన్న వారెవరైనా అయితే లొంగిపోవాలి లేకపోతే తూటాలకు బలవ్వాలి. కానీ వయసు అయిపోయి అనారోగ్యంతో చనిపోవడం అనూహ్యమే. అలా చనిపోతే.. ఆయన తన ఉద్యమ పంథాలో వ్యక్తిగతంగా విజయం సాధించినట్లే. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే బస్తర్ అడవల్లో అనారోగ్యంతో చనిపోయారని.. ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని బయటకు తెలిసింది. ఎప్పుడు చనిపోయారో స్పష్టత లేదు. దీనిపై పోలీసులు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఎన్ని చెప్పినా మావోయిస్టులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
సమాచారం బయటకు వచ్చే వరకూ ఏ విషయాన్ని్ మావోయిస్టులు చెప్పడం లేదు. ఇటీవల కరోనాతో కొంత మంది అగ్రనేతలు చనిపోయారు. ఆ విషయం బయటపెట్టలేదు. మీడియాలో విస్తృత ప్రచారం జరిగిన తర్వాతే … అవును చనిపోయారు.. ప్రజల సమక్షంలోనే అంత్యక్రియలు చేశామని ప్రకటిస్తున్నారు. బహుశా ఆర్కే విషయంలోనూ అలాగే చేసే అవకాశం ఉంది. మావోయిస్టుల తుపాకీ సిద్ధాంతం విషయంలో చర్చోపచర్చలు ఉన్నా..ఆయన తన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి ఉన్నారు. వైఎస్ హయాంలో జరిగిన చర్చలకు మావోయిస్టు బృందానికి నేతృత్వం వహించారు . చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనకు మాస్టర్ ప్లానర్‌గా ఆయనపై కేసులు నమోదయ్యాయి.
1983లో అడవుల్లోకి వెళ్లి అప్పట్నుంచి ఆ సిద్ధాంతానికే కట్టుబడి పని చేస్తున్నారు. అగ్రస్థానానికి ఎదిగారు. ఎన్ కౌంటర్లో ఆయన కుమారుడు చనిపోయారు. ఆయన భార్య పోలీసులకు లొంగిపోయారు. అయినా పట్టు వీడలేదు. చివరికి అడవిలోనే కన్ను మూశారు. ఆ అడవిలోనే అంతర్థానం అయిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలంటూ అందరికీ తెలిసిన వారెవరూ లేరు. ఆర్కే మరణంతో మావోయిస్టు పార్టీకి చాలా పెద్ద దెబ్బ. అవసాన దశలో ఉన్న మావోయిస్టులు కోలుకోవడంకష్టమే.