ఇటీవలి కాలంలో తెలుగు చానళ్లు సోషల్ మీడియాకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు.చర్చలకు విషయం కూడా ఆ కోణంలోనే నిర్ణయిస్తున్నారు. చేసిన చర్చలను యూ ట్యూబ్‌లో పోస్టు చేయడం, క్లిక్‌లను బట్టి ఆదరణ నిర్ణయించడం పరిపాటిగా మారింది. ఈ కారణంగా మరీ తీవ్రమైన రాజకీయ చర్చలకు వ్యవధి తగ్గిపోతున్నది. సోషల్ మీడియాలో పరిచితులైన వారికి అంశాలకు పెద్ద పీట వేస్తున్నారు. అగ్ర ఛానల్ అయితే అచ్చంగా అలాటి టాపిక్లే తీసుకుని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవంగా సోషల్ మీడియాలో థంబ్‌నైల్స్ పెట్టడం కోసం క్లిప్పింగులో లేని విషయాన్ని కూడా టైటిల్‌గా పెట్టి హంగామా చేస్తున్నారు. అజ్ఞాతవాసి ఆడియో విడుదలలో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకు తమకు తోచిన పేర్లు జోడించి ప్రసారం చేస్తున్నారు. కొంతమంది కత్తి మహేశ్‌కు పంచ్ వేశారంటే మరికొందరు రోజాకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారని కామెంట్లు పెడుతున్నారు. నిజానికి అందులో ఆ ఇద్దరి పేర్లు లేవు. సూటిగా వారికి వర్తించే విమర్శలూ లేవు.ఇలా లేని పేర్లు తీసుకొచ్చి జోడించడంలో బోలెడు రాజకీయం వున్నట్టు స్పష్టమవుతుంది.పైగా ఏది వైరల్ ఏది రియల్ అన్న ఛానళ్ల వారే తాము సోషల్ మీడియాలో వుంటే చర్చ చేస్తామని ప్రకటించేస్తున్నారు. మామూలుగా పోటీలో లేని చిన్న ఛానళ్లు కొన్ని యూ ట్యూబ్‌లో వేలు లక్షల క్లిక్‌లు పొందుతున్నాయి.అలా అలా మొత్తంపైన మీడియా సోషల్ మీడియా మధ్య గీత చెరిగిపోతున్నది.తమాషా ఏమంటే పెద్ద ఛానళ్లు సోషల్ మీడియా వైపు వస్తుంటే గతంలో ఇక్కడ ఒక వెలుగు వెలిగిన కొన్ని పెద్ద సోషల్ మీడియా సంస్థలు లాభాలు తగ్గాయని కార్యక్రమాలనూ సిబ్బందినీ తగ్గిస్తున్నాయి.