వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. పాలించమని అవకాశం ఇచ్చిన ప్రజలను ప్రభుత్వాలు ఇంత దారుణంగా దారి దోపిడి చేస్తాయా అని నివ్వెరపోయినా ప్రయోజనం ఉండదు. ఎందు కంటే ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రభుత్వాలు ప్రజల్ని దోపిడి చేస్తున్నాయి. కేవలం.. ఒక్క పెట్రో పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు వసూలు చేసిన పన్నుల మొత్తం రూ.6,71,461 కోట్లు. అంటే… ఏపీ లాంటి రాష్ట్రాల ఐదేళ్ల బడ్జెట్ అనుకోవచ్చు. ఈ విషయాన్ని పార్లమెంట్‌కు కేంద్రం తెలిపింది.
దేశ ప్రజలు 130 కోట్ల మంది అనుకుంటే.. అందరూ పెట్రో పన్నులు కట్టారనుకుంటే.. ఒక్కొక్కరు రూ. ఐదు వేల వరకూ పన్నులు కట్టినట్లన్నమాట. ఈ భారం ఒక్క పెట్రో ఉత్పత్తులపైనే పడదు. వాటి ధరలు పెరిగిన కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. వాటి ధరల్లో రవాణా కీలకం. ఆ రవాణా భారం అయినప్పుడు ఆటోమేటిక్ గా అన్నింటి ధరలు పెరుగుతాయి. దేశంలో అదే జరుగుతోంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ పన్నులు తాము పిండుకుంటున్నాయి. ప్రస్తుతం.. డీజిల్ ధర వంద వరకూ వచ్చింది. పెట్రోల్ ధర రూ. నూట పది దగ్గరక కనిపిస్తోంది. ఇందులో అత్యధికం పన్నులే. అసలు ధర … లీటర్ రూ. 30 వరకూ ఉంటుంది.కానీ కేంద్రాలు.. రాష్ట్రాలు దీన్నే ఆదాయ వరసుగా చేసుకుని పిండుకుంటూడటంతో… ఒక్కో లీటర్‌కు రూ. 70 పైనే ప్రజలు పన్నులు కట్టాల్సి వస్తోంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటికేడు.. ఈ పెట్రో పన్నుల ఆదాయాన్ని పెంచుకుంటూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు తగ్గించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ పెరిగినప్పుడు మాత్రం పెంచేస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేతదగ్గర్నుంచి ఏడాదిన్నరలో.. పెట్రోల్ ధర కనీసం రూ. 30 పెంచారు. ప్రజలు . పన్నులు కడుతూనే ఉన్నారు. ప్రభుత్వం పెంచుకుంటూనే పోతోంది.