కరోనా కారణంగా దేశానికి వేసిన లాక్డౌన్ తాళాన్ని కేంద్రం మూడు అన్ లాక్‌ల ద్వారా తీసేసింది. ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి కరోనాపై విజయం సాధించినట్లుగా ప్రకటించి సాధారణ జన జీవితాన్ని గడిపేలా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకూ సినిమా హాళ్లు, విద్యా సంస్థలపై ఆంక్షలు ఉన్నాయి. ఇక వాటిని కూడా ఎత్తివేయనున్నట్లుగా ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న అన్‌లాక్ 3 నిబంధనలు .. ఈ నెల 31వ తేదీ వరకు వర్తిస్తాయి. ఆ తర్వాత ఇక ఎలాంటి ఆంక్షలు.. ఏ రకమైన ఇండస్ట్రీలపైనా కానీ.. వ్యవహారాలపైనా విధించే అవకాశాలు లేవంటున్నారు.
ఇప్పటి వరకూ సినిమా షూటింగ్‌లకు ఉన్న ఆంక్షల్ని ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ధియేటర్లు ప్రారంభించడమే మిగిలింది. అవి కూడా ప్రారంభిస్తే.. ఇక ఏ రకమైన లాక్ డౌన్ నిబంధనలు అమల్లో లేనట్లే అవుతుంది. కరోనా కారణంగా స్తబ్దుగా మారిపోయిన ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే.. ప్రజలకు ఇప్పుడు ఆదాయం పెరగాల్సి ఉంది. అలా పెరగాలంటే.. అన్నిరంగాలు మళ్లీ పుంజుకోవాల్సి ఉంది. దీని కోసం కేంద్రం ఇప్పటికే ఆత్మ నిర్భర ప్యాకేజీని ప్రకటించింది. అమలు చేయడం ప్రారంభించారు. సెప్టెంబర్ ఒకటి తర్వాత ఈ అత్మనిర్భర ప్యాకేజీ ఫలితాలు ప్రజలకు అందే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు.. ప్రజల ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. వైరస్ ఇప్పటికీ కంట్రోల్ కాలేదు. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా… భారీ ఎత్తున జనం గుమికూడే కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల విషయంలో ఈ నిబంధనలు పెద్ద ఎత్తున అమలు చేయనున్నారు. నామినేషన్లు సహా ప్రచార కార్యక్రమాలన్నింటినీ ఆన్ లైన్ ద్వారానే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అదొక్కటి తప్ప… సెప్టెంబర్ నుంచి ఎలాంటి రూల్స్ కూడా ఉండే అవకాశం లేదు.
ఇప్పిటకే వైరస్‌తో సహజీవనం చేయాలని ప్రభుత్వాలు నేరుగానే చెబుతున్నాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలని అంటున్నారు. ఈ ప్రకారం.. సెప్టెంబర్ నుంచి వైరస్‌తో ప్రజల సహజీవనం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.