టీజర్ అంటే.. చాలా సింపుల్ వ్యవహారంలా మారిపోయింది. హీరో నడచుకుంటూ రావడం.. నాలుగైదు బిల్డప్ షాట్లు, భీకరమైన మ్యూజిక్కూ.. వెరసి – టీజర్ రెడీ అయిపోతోంది. ఫ్యాన్స్ ‘ఇదే మనకు విందు భోజనం’ అనేసుకుంటున్నారు. ఇలాంటి టీజర్లలో ‘టచ్ చేసి చూడు’ కూడా చేరిపోతుంది. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రాశీఖన్నా నాయిక. విక్రమ్ సిరికొండ దర్శకుడు. టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. యధావిధిగా రవితేజ బిల్డప్ షాట్లతోనే టీజర్ ముగించారు. ఒక్కడైలాగ్ కూడా లేదు. ఈ సినిమాలో రవితేజ పాత్రపై ఎలాంటి క్లూ ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్‌ని చూసి పోలీస్ అనుకోవాలంతే! జమ్ 8 (ఇది పేరో.. ఎనిమిది మంది కలిసి కొట్టే మ్యూజిక్కో తెలీదు) సంగీతం ఎప్పట్లా కమర్షియల్ టీజర్ బ్రాండ్‌ని ఫాలో అయిపోయింది. ఈ సంక్రాంతికే ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. హడావుడిగా సినిమాని తీసుకురావడం ఇష్టం లేక… విడుదల వాయిదా పడింది.