తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5
అవకాశం ఎవరికైనా ఒకసారే తలుపుతడుతుంది. ఇది సినిమా డైరక్టర్ గా మారాలనుకున్నవాళ్లకైనా సరే. దాన్ని వాడుకుంటే ఓకె. లేదంటే, అక్కడితో మారాకు వేయకుండా మాడిపోవడమే. టాలీవుడ్ లో యంగ్ డైరక్టర్ల హవా నడుస్తోంది. ఎవరికి వచ్చిన సృజన వాళ్లు ప్రదర్శిస్తూ జేజేలు అందుకంటుంటే, రచయిత విక్రమ్ సరికొండ, వేరే రచయిత కథను నమ్ముకుని, తనకు తోచింది తాను తీసి ఓ సారి ‘టచ్ చేసి చూడు’ అన్నాడు. కానీ తీరా సినిమా చూస్తే టచ్ చేసి చూడడానికే భయమేసేలా తయారైంది.
ఇంతకీ టచ్ చేసి చూడు అనే పక్కా మాస్ టైటిల్ పెట్టుకుని వచ్చిన సినిమా కథేంటీ అనుకున్నారు? కథేంటీ అనుకునే ముందు అది ఎవరు ఇచ్చారు అన్నిది చూడాలి. వక్కంతం వంశీ. కథకు కొటి తీసుకునే వక్కంతం ఇచ్చింది పక్కా పాత చింతకాయపచ్చడి కథ.
సినిమా ఆరంభంలో హీరో బుద్దిమంతుడిలా, పక్కోడి ఊసి పట్టని వాడిగా వుంటాడు. తీరా ఇంటర్వెల్ బ్యాంగ్ కు అతగాడు అలాంటి ఇలాంటివోడు కాదు, పరమ తురుము తోపు అని తెలుస్తుంది. దాంతో సెకెండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక మళ్లీ వర్తమానం లోకి వచ్చి, విలన్ ను చావ చితక కొట్టడంతో సినిమా అయిపోతుంది.
ఇలా చెబితే, నేల క్లాసు నుంచి బాల్కనీ వరకు వుండే అన్ని తరగతుల ప్రేక్షకులు కూడా నోరు వెళ్లబెట్టి, ఏంటీ ఇదా కథ? దీనికా కోటి? ఇలాంటి సినిమాలు ఎన్ని చూడలేదు. మెగాస్టార్ నుంచి యంగ్ స్టార్ ల వరకు ఈ టైపు కథతో సినిమా చేయని హీరో వున్నాడా? అని ఎకెసెక్కాలాడతారు. కానీ ఏం చేస్తాం? డైరక్టర్ విక్రమ్ కు, ఈ కథను నమ్మి సినిమాపై కోట్లు పెట్టేసిన నిర్మాతలకు ఇది కొత్తగా అనిపించింది. అందుకే తీసేసారు.
కార్తికేయ (రవితేజ) ఫ్యామిలీ ఫ్యామిలీ అంటూ పరితపించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పదే పదే కెలుకుతుంటాడు పాండిచ్చేరిలో ఓ రౌడీ. ఇతగాడినే ఎందుకో మనకీ తెలియదు. అలాంటి వాడు ఓ మర్డర్ చేస్తాడు. అది కార్తికేయ సోదరి చూస్తుంది. మర్డర్ ఎవరు చేసాడు అంటే వాడు అయిదేళ్ల క్రితం చనిపోయిన వాడు అని తేల్తుంది. చనిపోయినవాడు మర్డర్ ఎలా చేసాడు అన్నది తీగలాగితే, కార్తికేయ ఫ్లాష్ బ్యాక్ కదుల్తుంది. సదరు నేఫథ్యంలో కార్తికేయ ఓ గట్టి పోలీస్ ఆఫీసర్. కుటుంబాన్ని, ప్రియురాలిని (సీరత్ కపూర్) ను పట్టించుకోకుండా డ్యూటీ చేస్తుంటాడు. అలాంటి వాడు ఇలా పాండిచ్ఛేరిలో ఇంత సాత్వికంగా ఎలా మారిపోయాడు? అసలు ఏం జరిగింది? అన్నది మిగిలిన సినిమా.
ఏ సినిమాకైనా కథ,కథనాలు, హీరో హీరోయిన్లు కీలకం. ముందే చెప్పేసుకున్నట్లు ఈ సినిమాకు కథ, కథనాలు పక్కా పాతవే. సరే హీరోను కదా నమ్మి సినిమా తీసింది అనుకుంటే, హీరో ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కోలా వుంటాడు. ఈ సినిమా ఇప్పుడు తీసిందో? కిక్ 2 టైమ్ లో స్టార్ట్ చేసి ఇప్పటి దాకా తీసారో అన్న అనుమానం కలుగుతుంది. హీరో ఫేస్ కంటిన్యూటీ అన్నది లేదు. గ్లామర్ అన్నది వెదుక్కుందామన్నా హీరో ఫేస్ లో కనిపించదు. సినిమా కథ అంతా మలి సగానికి మూటకట్టి దాచేసుకుని, తొలిసగం నడిపించడానికి దర్శకుడు ఏదేదో చేసాడు. ప్రేక్షకుడు కుర్చీలో అచేతనంగా కూర్చుని వుంటే, పాటలు వాటి మానాన అవి వచ్చి పోతుంటాయి. ఆ పాటల్లో కూడా హీరోను చూస్తే, అంటే అభిమానులు ఫీలవుతారేమో కానీ, ఇంక సినిమాలు ఆపేస్తే బెటరేమో అన్న భావన కలుగుతుంది.
ఇలా ఫస్ట్ హాఫ్ అయిన తరువాత ద్వితీయార్థం మొదలవుతుంది. హీరోచిత వ్యవహారాలు, విలన్ తో సవాళ్లు, ప్రతి సవాళ్లు మొదలవుతాయి. భారీ ఫైట్లు వీటికి తోడు. ఇవన్నీ కాస్త రొటీన్ నే అయినా, తొలిసగం చూసిన వైరాగ్యం తో పోల్చుకుంటే కాస్త బెటర్. అక్కడ కూడా హీరోయిన్, పాటలు చూస్తుంటే అవి బాగుండడం మాట అలా వుంచి, నిర్మాతలు ఎన్ని కోట్లు పాపం, అనవసరంగా ఖర్చు పెట్టేసారా? అనిపిస్తుంది. సినిమాలో మాస్ జనాలను కాస్త ఆకట్టుకునేవి భారీ ఫైట్లే. కానీ సినిమాల్లో చూసీ, చూసీ బోరు కొట్టేసినవే అవీనూ.
సినిమాకు ఎప్పుడు అయితే ఓ దశ, దిశ లేదో, అప్పుడు సినిమాలో నటనలు, సాంకేతిక విలువలు కూడా పక్కదారి పట్టేస్తాయి. రవితేజ తన స్టయిల్ ఎనర్జీ అందించే ఫ్రయత్నం చేసాడు కానీ, గ్లామర్ కళ తప్పిన ఆ మొహం వల్ల అదంతా పక్కకు పోయింది. విక్రమార్కుడు సినిమాలో పోలీస్ యూనిఫారమ్ లో మెలితిరిగిన మీసంతో పులిలా కనిపించిన ఆ రవితేజేనా ఈ సినిమాలో అదే యూనిఫారమ్ లో కనిపించింది అని అనిపిస్తుంది. రాశీఖన్నా ఓకె. సీరత్ కపూర్ ను కేవలం షార్ట్స్ లో చూపించడం కోసమే బుక్ చేస్తున్నారేమో? వెన్నెల కిషోర్ ను కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు.
దీపక్ రాజ్ స్క్రీన్ ప్లే, వక్కంతం వంశీ కథ, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, మణిశర్మ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, ఇన్ని పేర్లు వున్నాయి. కానీ ఫలితం అంతంతమాత్రమే. తనకు అందిన అవకాశాన్ని దర్శకుడు విక్రమ్ సరికొండ దిగ్విజయంగా పాడు చేసుకున్నాడు.
తీర్పు :
ఇలా ఇలాంటి సినిమా గురించి ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పాపం, ఇలాంటి టీమ్ ను, ఇలాంటి కథను నమ్ముకుని కోట్లు పెట్టిన నిర్మాతలను చూస్తే బాధ ఎక్కువ అవుతుంది. ఎంతమంది యువదర్శకులు అందివచ్చిన అవకాశం ఆలంబనగా విజయాల నిచ్చెనలు ఎక్కుతుంటే, ఈ దర్శకుడు ఇలా ఎందుకు చేజార్చుకున్నాడా అని కూడా అనిపిస్తుంది
ఫినిషింగ్ టచ్
‘టచ్ చేస్తే షాక్ నే’
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5