తెలంగాణ రాజకీయాల్లో నల్లగొండది ప్రత్యేక స్థానం. టీపీసీసీ అగ్రనేతలందరిదీ నల్లగొండ జిల్లానే. వీరు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఓటమి అంటూ ఎరుగని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఐదోసారి బరిలోకి దిగుతున్నారు. ఈ సారి ఎలాగైనా కోమటిరెడ్డి హవాకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం…. కాంగ్రెస్ కు కంచుకోట… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 1999 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. మంత్రిగానూ పనిచేశారు. ఐదోసారి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు.
2014 వరకు టీఆర్ఎస్కు నల్లగొండలో బలం లేదు. కానీ.. టీడీపీ నేతగా ఉండి.. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేయడంతో.. తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి… కోమటిరెడ్డిని గట్టిగా ఢీకొన్న కంచర్ల భూపాల్ రెడ్డి కోమటిరెడ్డికి ప్రత్యర్థిగా టీఆర్ఎస్ తరపున నిలబడ్డారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్తామని భూపాల్ రెడ్డి ప్రయత్నించారు… కానీ కోమటిరెడ్డి ఒప్పుకోకపోవడంతో… ఆయన చేరలేకపోయారు. అయితే..టీఆర్ఎస్ లో చేరడమే కాదు.. టిక్కెట్ కూడా దక్కింది. దీంతో ఇరువురి మధ్య పోరాటం.. తీవ్ర స్థాయిలోనే ఉండనుంది. కోమటిరెడ్డి కీలక అనుచరుల్లో చాలా మంది అధికార పార్టీలో చేరిపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక క్యాడర్ కూడా పార్టీ మారింది. ఇక నల్లగొండ మున్సిపాలిటీలో అయితే చాలామంది కౌన్సిలర్లు, ఇతర నేతలు కూడా గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అధికారం ఆశతో వారందరూ వెళ్లినా.. మళ్లీ ఇప్పుడు అందరికీ వరుసగా కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారు కోమటిరెడ్డి.
టీఆర్ఎస్ లో ఉన్న గ్రూపు రాజకీయాలను కూడా తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. టికెట్టు ఆశించి భంగపడిన టీఆర్ఎస్ నేతల అనుచరులను చేరదీసి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టీఆర్ఎస్ లో పనిచేస్తున్న వారిపై, మధ్యలో టీఆర్ఎస్ లో వచ్చి చేరిన వారిపై, ఇక బిజేపీ, వామపక్షాలకు చెందిన ముఖ్య నేతలు, క్యాడర్ కు టచ్ లోకి వెళ్తున్నారు. టీడీపీతో పొత్తు కూడా కోమటిరెడ్డికి అదనపు బలం. నిత్యం ప్రజల్లో ఉండడం, పటిష్టమైన పోల్ మేనేజ్ మెంట్ కోమటిరెడ్డికి అదనపు బలం. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భూపాల్ రెడ్డి వరుసగా రెండో సారి తలపడుతున్నారు. ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న కసితో ఉన్నారు. భూపాల్ రెడ్డి బలాబలాలు తెలిసిన కెసిఆర్, పార్టీలో చేరిన రోజునే నియోజకవర్గ ఇన్‌చార్జీగా ప్రకటించారు. గతంతో పొలిస్తే… అధికార పార్టీ అభ్యర్ధి కావడం భూపాల్ రెడ్డికి ఈ సారి అదనంగా కలిసొచ్చే అంశం.
గెలుపు కోసం భూపాల్ రెడ్డి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా… సొంతపార్టీలో అసమ్మతి ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మూడో స్తానంలో నిలిచిన దుబ్బాక నర్సింహ్మారెడ్డి.. ఆది నుంచి పార్టీలో ఉన్న చకిలం అనిల్ కుమార్, మధ్యలో పార్టీలో చేరిన తండు సైదులు గౌడ్ లాంటి వారంతా భూపాల్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగించే పనిచేస్తున్నా ఇప్పటికిప్పుడే అయితే ఫలితం కానరావడం లేదు.