డంకీ – సలార్ ఒక రోజు వ్యవధిలో విడుదల అవుతున్నాయి. డంకీ క్లాస్ సినిమా. సలార్ పక్కా మాస్. జోనర్లు వేరు. హీరోలు వేరు. నేపథ్యాలు వేరు. అయితే.. సలార్ వల్ల డంకీకే ఇబ్బంది అనేది విశ్లేషకుల మాట. మాస్ సినిమాకి ఉన్నంత ఆదరణ.. క్లాస్ సినిమాలకు దక్కదు. కాబట్టి సలార్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తాడని నమ్మకం.
కాకపోతే.. పరిస్థితులు అంత ఈజీగా కనిపించడం లేదు. షారుఖ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టాడు. రాజ్ కుమార్ హిరాణీని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తన సినిమాలకు క్లాస్, మాస్ బేధం ఉండదు. నచ్చితే…వేయి కోట్లు గుమ్మరించడానికి బాలీవుడ్ సిద్ధం. దక్షిణాది సినిమాల్ని బాలీవుడ్ చూస్తుంది. కానీ.. వాళ్లకు హిందీ సినిమా అంటేనే మోజు! బాలీవుడ్ పై దక్షిణాది ఆధిక్యం చూపిస్తే బాలీవుడ్ జనాలు కూడా తట్టుకోలేరు. ఈ విషయం చాలా సార్లు రుజువైంది. అందుకే సలార్‌పై తమ ఆధిపత్యం చూపించడానికి అక్కడ ఆల్రెడీ ప్రయత్నాలు మొదలైపోయాయి. ప్రీమియర్ షోలూ, ఎక్ట్సా షోలూ అంటూ.. ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలెట్టేశారు. ఈనెల 21న డంకీ విడుదల అవుతోంది. 20 అర్థరాత్రి నుంచే ప్రీమియర్లు షురూ అవుతాయి. దాదాపు 750 లోకేషన్లలో ప్రీమియర్లు ప్రదర్శించడానికి డంకీ టీమ్ సిద్ధమైంది. ఈసారి ప్రీమియర్ల బాధ్యతని షారుఖ్ అభిమానులే తీసుకొన్నారు. ఓవర్సీస్లో దాదాపు 50 నగరాల్లో ప్రీమియర్లు పడనున్నాయి. తొలి మూడు రోజుల్లో అన్ని షోలూ హౌస్ ఫుల్ అవ్వడం ఖాయం. డంకీ – సలార్ ఒకేసారి వస్తున్నా.. బాలీవుడ్ జనాల మొదటి ఆప్షన్ డంకీనే. ఆ తరవాతే సలార్. అది కూడా సలార్‌కి మౌత్ టాక్ బాగుండాలి. సలార్‌కి పెట్టిన పెట్టుబడి దృష్ట్యా ఈ సినిమా దక్షిణాదిలో ఆడితే సరిపోదు. బాలీవుడ్ నుంచి కూడా దండిగా వసూళ్లు రాబట్టాలి. అలా జరగాలంటే.. డంకీతో పాటు పోటీగా వసూళ్లు సాధించాలి. డంకీకి ఏమాత్రం పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చినా.. సలార్‌కు ఇబ్బందే. అలాకాకుండా డంకీ కాస్త డల్ అయితే.. సలార్ పూర్తిగా పుంచుకొంటాడు. ఏదేమైనా.. డంకీని గెలవడం అంత ఈజీ కాదు.