2018 ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచి.. బీఆర్‌ఎ్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒకరికి తప్ప అందరికీ టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. వారిలో 12 మంది బీఆర్‌ఎ్‌సలో చేరారు. వీరితోపాటు టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరిపోయారు. మొత్తంగా 14 మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొన్నారు. వారిలో 13 మంది ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈసారి టికెట్లు ఇచ్చింది. వారి పరిస్థితి గడ్డుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జడిల్లాలో కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, కందాళ ఉపేందర్‌రెడ్డి తోపాటు టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పుడు అగ్రనేతలు కాంగ్రెస్ లో చేరిపోవడంతో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉక్కపోత ఎదుర్కొంటున్నారు. వీరిలో ఒకరిద్దరు కూడా బయటపడటం కష్టమన్న అభిప్రాయం ఖమ్మంలో జోరుగా వినిపిస్తోంది.
ఇతర జిల్లాల నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి.. బీఆర్‌ఎ్‌సలో చేరిన వారి పరిస్థితి కూడా ఏ మాత్రం సవ్యంగా లేదు. తాండూరులో రోహిత్ రెడ్డికి.. మహేందర్ రెడ్డి సహకరించడం కష్టంగా మారింది. తాండూరులో రోహిత్ రెడ్డి ఓడిపోతేనే తనకు స్పేస్ ఉంటుందని ఆయనకు తెలుసు. మిగిలిన చోట్లా బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. 2018లోనూ కాంగ్రెస్, టీడీపీల నుంచి చేరిన అనేక మందికి కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. వారిలో అత్యధికులు గెలిచారు. మరి ఈ సారి ప్రజలు ఏ తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది.