ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉమన్ చాందీకి బాధ్యతలు అప్పగించారు. 11 సార్లు చట్టసభలకు ఎన్నికైన అనుభవం ఉన్న దిగ్గజం ఉమన్ చాందీ. ఆయన అనుభవం ఏపీ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పనికొస్తుందని హైకమాండ్ భావించింది. గురువారం ఆయన ఏపీ ఇన్ ఛార్జ్ బాధ్యతల్ని ఢిల్లీలో స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఆదరణ ఉన్నరాష్ట్రాల్లో ఆంధ్రా కూడా ఒకటన్నారు. గత ఎన్నికల్లో ఒక చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన డీలాపడే పరిస్థితి ఉండదన్నారు. రెండ్రోజులపాటు తాను ఏపీకి రాబోతున్నట్టు ఉమన్ చాందీ చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతాననీ, పార్టీ భవిష్యత్తుపై చర్చిస్తా అన్నారు. 2014 ఎన్నికలు తరువాత పార్టీ విడిచి వెళ్లిపోయిన నాయకుల్ని మళ్లీ కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని చెప్పారు.
ప్రాక్టికల్ గా చూసుకుంటే… ఒక పెద్ద ఛాలెంజ్ ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ముందు ఉందని చెప్పాలి. పార్టీకి గత వైభవం రావాలంటే, గతంలో కాంగ్రెస్ కి ఉన్న ఓటు బ్యాంకు మళ్లీ తిరిగి రావాలి. ప్రయత్నిస్తే, వెళ్లిపోయిన నాయకుల్లో కొందర్ని రప్పించే అవకాశం ఉంటుందేమో కానీ.. చేజారిన ఓటు బ్యాంకును వెనక్కి తీసుకుని రావాలంటే చిన్న విషయమేమీ కాదు. నిజానికి, ఏపీలో కాంగ్రెస్ కు క్షేత్రస్థాయి నుంచీ బలమైన కేడర్ ఉండేది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో.. ఏపీలో ఆ కేడర్ లో చాలా భాగం వైకాపా సొంతం చేసుకుంది. వైయస్సార్ గెలసీ అంతా వారసుడిగా జగన్ ఖాతాలో పడింది. ఇదే సమయంలో పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదనే అభద్రతాభావం నాయకుల్లో నెలకొంది. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేడర్ ను వెనక్కి తీసుకుని రావడం చాలా పెద్ద సవాల్. కారణం ఏంటంటే… కాంగ్రెస్ పార్టీపై విభజన మరక ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇంకోటి, సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే… ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలు స్పష్టమైన కుల విభజనతో కనిపిస్తున్నాయి..! కేడర్లను కూడా ఆ ప్రాతిపదికగానే బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది..? ప్రయత్నించినా ఆకర్షితమయ్యేందుకు సిద్ధంగా ఉన్నవారు ఎవరనేది ప్రశ్న..? వైయస్సార్ హయాంలో జరిగిన సంక్షేమం గురించి కాంగ్రెస్ ప్రచారం చేసుకోలేకపోయింది. అలాగని, ఇప్పుడు వైయస్ ఫొటో పెట్టుకుని కాంగ్రెస్ ప్రచారానికి దిగినా లాభం తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఉమన్ చాందీ ఎలా పైకి తీసుకొస్తారనేది వేచి చూడాలి. ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయిన వ్యతిరేక ముద్రను ఎలా మార్చుతారనేదీ ప్రశ్నే.