విరాట్ కోహ్లి సారధ్యంలో టీమిండియా దూసుకుపోతుంది. అభిమానులు సంబర పడే విజయాలను అందిస్తోంది విరాట్ సేన. వరుస విజయాలతో ఇప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంకు చేరుకుంది టీమిండియా. న్యూజీలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్.. ఇలా వరుస జట్లను ఓడించి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది టీమిండియా. అయితే ఇప్పుడు టీమిండియా ముందు అసలు సిసలైన పరీక్ష వుంది. ఆస్ట్రేలియా రూపంలో ఓ పెద్ద సవాల్ ను ఎదుర్కొబోతుంది టీమిండియా. నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ పైనే అందరి కళ్ళు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఏ జట్టయినా నెర్వస్ ఫీలౌతుందన్నమాట ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అలాంటింది. ఆస్ట్రేలియాను డీ కొట్టడం ఏ జట్టుకైనా ఓ సవాలే. ఇప్పుడు ఆ సవాల్ కు రెడీ అవుతోంది టీమిండియా. అయితే విరాట్ సేన ఈ సీరిస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వుంది. ”జట్టు ఏదైనా మా జోరు ఒక్కటే” అని బంగ్లాదేశ్ మ్యాచ్ అనంతరం ప్రకటించాడు విరాట్ కోహ్లి. కోహ్లి ప్రకటన మాట అలావుస్తే.. ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరమైన జట్టు. ఆ జట్టును ఎదుర్కోవడానికి సర్వశక్తులు ప్రయోగించాల్సిందే. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో పటిష్టంగా వుంది ఆసీస్. భారత్ విషయానికి విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా బౌలింగ్ విషయంలో మెరుగుపడాల్సివుంది. దీనికి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచే ఉదాహరణ. పసికూనలుగా వచ్చిన బంగ్లాదేశ్… మ్యాచ్ ను చివరి రోజు వరకూ తీసుకువెళ్ళగలడం మన బౌలింగ్ బలహీనతను ఎత్తిచూపుతోంది. ఆసీస్ సిరిస్ కు ముందు బంగ్లా మ్యాచ్ ఖచ్చితంగా విరాట్ కోహ్లి కు ఓ హెచ్చరిక.
ఎటాకింగ్ గేమ్ ప్లాన్ చేయడంలో ఆసీస్ ది ప్రత్యేకమైన శైలి. టెస్ట్ మ్యాచ్ లకి వచ్చేసరికి ఆసీస్ బౌలర్లు మెరుపు వేగంతో కదులుతారు. వికెట్ టు వికెట్ బంతులు విసురుతారు. ఫాస్ట్ బౌలింగ్ ఆ జట్టు ప్రధాన ఆయుధం. మన జట్టు విషయానికి వస్తే.. స్విన్ మ్యాజిక్ పై ఎక్కువ ఆదారపడుతుంది. అశ్విన్, జడేజా, మిశ్రా.. ఇలా వీళ్ళలో ఎవరి మ్యాజిక్ వర్క్ అవుట్ అయినా పని తేలిక అవుతుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ , న్యూజీలాండ్ జట్లపై భారత్ స్విన్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. దక్షిణాఫ్రికా తో జరిగిన సిరీస్ లో అయితే టోటల్ స్విన్ ఆధిపత్యేమే కనిపించింది. ‘స్విన్ కి అనుకూలంగా పిచ్ లను తయారుచేసుకున్నారు”అనే విమర్శ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చేది ఆసీస్ జట్టు. స్విన్ ను చాలా ఈజీగా ఆడుతారు కంగారులు. మరో విషయం ఏమిటంటే.. ఇక్కడ పిచ్ కండీషన్ కూడా బాగా అలవాటు పడ్డారు ఆసీస్ ఆటగాళ్ళు. ఐపీయల్ రూపంలో ఇక్కడ పిచ్ ల పై బోలెడు అనుభవం సంపాదించుకున్నారు. ఈ టెస్ట్ సీరిస్ కు ఎంపికైనా ఆటగాళ్ళు దాదాపు ఐపీయల్ లో స్టార్ ప్లేయర్సే. ఇది ఖచ్చితంగా ఆ జట్టుకు కలిసొచ్చే విషయం. అయితే మన బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా వుంది. దాదాపు మ్యాచ్ ల్లో భారీ స్కోర్ సాధించిపెట్టారు మన బ్యాట్స్ మెన్స్. అయితే ఆసీస్ బౌలింగ్ ఎటాక్ ను ఇంత సమర్ధవంతగా ఎదుర్కుంటారో అన్నది ఇప్పుడు కీలకం కానుంది.
మొత్తం మ్మీద వరుస విజయాలతో దూకుడు మీద వున్న టీమిండియాకు ఆసీస్ రూపంలో అసలు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. టెక్నికల్ గా ఇప్పుడు టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కంగారులును చిత్తు చేస్తే గనుక ఇక తిరుగులేని జట్టుగా జెండా పాతేయోచ్చు.