ఓ కుటుంబంలో ఎంత మంది హీరోలున్నారన్నది ముఖ్యం కాదు. వాళ్లంతా ఏం చేస్తున్నారు, ఎలాంటి సినిమాలు తీస్తున్నారన్నదే ముఖ్యం. ఎందుకంటే పరిశ్రమ చూసేది అదే. అక్కినేని వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్న నాగార్జున.. తన కొడుకులిద్దరినీ హీరోలు చేశాడు. జోష్ సినిమా ఫ్లాప్ అయినా.. చైతూ మెల్లమెల్లగా నిలదొక్కుకోగలిగాడు. మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకొన్న చైతూ.. లవ్ స్టోరీలలో మాత్రం తన మార్క్ చూపించుకోగలిగాడు. మొత్తానికి ఓ ప్రామిసింగ్ హీరోగా మారాడు.
అఖిల్‌పై ముందు నుంచీ భారీగా అంచనాలు ఉండేవి. చైతూ కంటే పెద్ద స్టార్ అవుతాడనుకొన్నారంతా. కానీ.. అవన్నీ తల్లకిందులయ్యాయి. చైతూలానే అఖిల్ ఎంట్రీ కూడా తుస్సుమంది. ఆ తరవాత.. అఖిల్ రకరకాల జానర్లు ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ వర్కవుట్ కావడం లేదు. ఏజెంట్ తో మాత్రం ఇది వరకు లేని నెగిటివిటీ పోగు చేసుకొన్నాడు. చైతూ కూడా ఇప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. థ్యాంక్యూ నిరాశ పరిచింది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో చేసిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ… కస్టడీ. మొన్నటికి మొన్న అఖిల్ ఇచ్చిన షాక్ లోంచే తేరుకోని అక్కినేని అభిమానులు ఇప్పుడు చైతూ సినిమాతో ఇంకా నిరాశలో కూరుకుపోయారు.
పోనీ.. నాగార్జున కెరీర్ అయినా బాగుందా అంటే.. అదీ లేదు. మన్మథుడు 2, ది ఘోస్ట్, వైల్డ్ డాగ్… ఇవన్నీ ఫ్లాపులే. నాగార్జున తన వయసుకి తగిన పాత్రల్ని ఎంచుకోవడం లేదన్నది అందరి మాట. ఈ వయసులో ఎలాంటి కథలు చేయాలో అలాంటి కథలు చేయడం లేదు నాగ్. కథల ఎంపికలో తన జడ్జ్మెంట్ రాంగ్ అవుతోంది. అలాంటప్పుడు తనయుల కథల్ని ఎలా జడ్జ్ చేస్తాడు? కొత్త దర్శకులతో కొత్త తరహా సినిమాలు తీసి, విజయాలు సాధించిన నాగార్జున.. కొంతకాలంగా ఎందుకో అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తనయులు కూడా హిట్ వెంట పరుగులు పెడుతున్నారు. క్రేజీ కాంబోల్ని నమ్మి.. ఫ్లాపులు కొని తెచ్చుకొంటున్నారు. అక్కినేని హీరోలు మేల్కోవాల్సిన తరుణం ఇది. వాళ్లు చేస్తోందల్లా.. తమకు సరిపడని కథల్ని ఎంచుకోవడమే. ఈ విషయంలో వాళ్ల తప్పుల్ని గ్రహించాలి. లేదంటే… అక్కినేని లెగస్సీ.. మెల్లమెల్లగా మసకబారేబారే ప్రమాదం ఉంది.