రజనీ సినిమా వస్తోందంటే పూనకం
కమల్ని చూడాలని కుతూహలం
విక్రమ్, సూర్య, కార్తి… వీళ్లూ మన హీరోలే.
డబ్బింగు సినిమాల్ని ఆదరించడంలో… తెలుగు ప్రేక్షకులదెప్పుడూ పెద్ద మనసే. మనసుకి నచ్చితే చాలు. అది తెలుగు సినిమానా, అనువాదమా? అనే సంగతి పట్టించుకోనే కోరు. తెలుగు సినిమాల్ని తలదన్నే రీతిలో తమిళ అనువాదాలకు కాసులు కురిశాయంటే నమ్మి తీరాల్సిందే. తమిళంలో యావరేజ్ టాక్‌తో నడిచిన సినిమాలు సైతం తెలుగులో హిట్.. సూపర్ హిట్ అయిపోయాయి. బిచ్చగాడు లాంటి సినిమాకి కోట్లు గుమ్మరించిన ప్రేక్షకులం మనం. అందుకే…. తమిళ డబ్బింగులకు విపరీతమైన మార్కెట్, ఫాలోయింగ్ ఏర్పడ్డాయి. ఏమైందో గానీ, కొంతకాలంగా తెలుగులో డబ్బింగుల హవా కనుమరుగైపోయింది. ఈ యేడాది తొలి ఆరు నెలల్లో పదుల సంఖ్యలో డబ్బింగులు విడుదలయ్యాయి. అయితే.. వాటిలో మెరిసిన సినిమాలెన్ని అంటే… సంతృప్తికరమైన సమాధానం రాదు.
హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల నుంచి తెలుగులోకి ఈ ఆరు నెలల కాలంలో దాదాపు 30 సినిమాల వరకూ విడుదలయ్యాయి. సూర్య, రజనీ, విక్రమ్, కార్తి, విశాల్… ఇలా హీరోలంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీటిలో నిర్మాతలకు డబ్బులు తీసుకొచ్చిన సినిమా కేవలం ‘అభిమన్యుడు’ మాత్రమే. కార్తి ‘చినబాబు’ ఈవారమే విడుదలైంది. దానికి టాక్, వసూళ్లు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. విక్రమ్‌కి ఏమాత్రం టైమ్ కలసి రావడం లేదు. తమిళనాటే కాదు, తెలుగులోనూ తన సినిమాలు ఫట్టే. ‘స్కెచ్’ రూపంలో తనకు మరో ఫ్లాప్ ఎదురైంది. నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘కర్తవ్యం’కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ.. వసూళ్లే రాలేదు. అంతెందుకు.. రజనీకాంత్ ‘కాలా’కీ… బయ్యర్లు భారీ ఎత్తున నష్టపోయారు. ‘బిచ్చగాడు’తో అందరినీ ఆశ్చర్యపరిచిన విజయ్ ఆంటోనీ.. ఆ తరవాత ఒక్కటంటే ఒక్క హిట్టూ కొట్టలేకపోయాడు. తన తాజా చిత్రం ‘కాశి’ కూడా కంచికి వెళ్లిపోయింది. జనవరిలో విడుదలైన ‘గ్యాంగ్’ కి కాస్తో కూస్తో ఓపెనింగ్స్దక్కాయి. అదీ.. సంక్రాంతి సీజన్ వల్ల.
మొత్తంగా చూస్తే ఒక్క విశాల్‌కి తప్ప ఇంకెవ్వరికీ హిట్ దక్కలేదు. దాంతో.. డబ్బింగ్ సినిమాల మార్కెట్ పూర్తిగా డల్ అయిపోయింది. పాతికో, యాభయ్యో పెట్టి డబ్బింగ్ రైట్స్ తీసుకుని, మరో కోటి రూపాయల ప్రమోషన్ చేసి, కాస్తో కూస్తో క్రేజ్ తెచ్చుకుని సినిమా విడుదల చేస్తే… అదృష్టం కొద్దీ ఆడితే, నిర్మాతలకు డబ్బులు మిగులుతాయి. అయితే గతంలో సాధించిన విజయాల్ని చూసుకుని, డబ్బింగ్ రైట్స్ అమాంతం పెంచేశారు. ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టిన తరవాత ప్రమోషన్లు చేసుకోకపోతే ఎలా? దానికి మరో కోటిరూపాయల వరకూ ఖర్చు. ఇలా.. పెట్టుబడి పెంచుకుంటూ పోతున్నారు. ఆ స్థాయిలో వసూళ్లు దక్కడం లేదు. రజనీ, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు సైతం ఓపెనింగ్స్ దక్కడం లేదు. దాంతో… తమిళ సినిమాని కొనడానికే నిర్మాతలు భయపడిపోతున్నారు. ఇప్పుడు ‘రోబో 2’ వస్తోంది. దానిపై క్రేజ్ ఉన్నా… ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అందరికీ భయం వేస్తోంది. భారీ రేట్లకు కొని, పూర్తిగా మునిగిపోవడం ఇష్టం లేని బయ్యర్లు… పెద్ద సినిమాల జోలికి వెళ్లడం లేదు. ఏ రకంగా చూసినా…డబ్బింగ్ సినిమాల కళ తగ్గిపోయింది. మళ్లీ పుంజుకోవాలంటే.. ఒకట్రెండు భారీ హిట్లు పడాల్సిందే.