తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్‌రావుపై మీడియాలో కథనాల జోరు పెరగడమే గాక తీరు కూడా మారుతున్నది. ఆయనను ఒంటరిని చేయాలన్న అధినేత వ్యూహానికి అనుగుణంగానే ఇదంతా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో కీలకమైన ఏ ప్రకటనా హరీశ్‌తో చేయించింది లేదు. ఆయన వర్గీయులకు పదవులు కూడా రాలేదు. హరిష్ పనిగట్టుకుని కాంగ్రెస్‌కు ప్రతిపక్షాలకు సమాధానం పేరిట తీవ్రభాషలో మాట్లాడుతున్నా మెచ్చుకోవడం లేదు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన ఉత్సవంలో హరీశ్ తనను ఆకాశానికెత్తుతూ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ముభావంగా నిర్వికారంగా అటూ ఇటూ చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి. హరిష్ కంచుకోట సిద్దిపేటలో కూడా తన ఆయన శిబిరానికి చెందన వారిని మొహరించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ఎలాటి సంక్షోభాలు వచ్చినా ట్రబుల్ షూటర్‌గా హరీశ్‌నే పంపే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. ఇక హరీశ్ పాలకపక్షంలో వుండటం అసాద్యమనీ, కాంగ్రెస్‌లోకి ప్రవేశిస్తారనీ ఒక కథనం చలామణిలో వుంటే కాదు బిజెపిలో చేరతారన్నట్టు ఇంకో కథనం. వీటిని ఖండించడానికి కూడా హరీశ్ శిబిరం పెద్ద ఉత్సాహం చూపించడం లేదంటే పరిస్థితి అర్థమవుతుంది. కెటిఆర్ నాయకత్వానికి పైపైనైనా మద్దతు తెలిపినా ఒకటికి రెండు సార్లు తనకు అమోదమేనని చెప్పినా ఇంకా ఎందుకు నమ్మడం లేదన్నది హరీశ్‌కు అంతుపట్టడం లేదట. తమ నాయకుడికి ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం తగ్గిందని స్పష్టమైనాక ఆయన అనుయాయుల్లోనూ జారుకునే వారు జారిపోతున్నారు. హరీశ్ సర్దుకోకతప్పదని టిఆర్ఎస్ సీనియర్ నాయకులొకరు నాతో ఇంటర్వూలో స్పష్టం చేశారు. ఎంత సర్దుకున్నా ఇంకా వుండనీయడం లేదని ఆయన అనుయాయులు వాపోతున్నారు. ఇమడలేని పరిస్థితులు కల్పించాలనే వ్యూహం తప్పితే ఆయనపై అంత ఒత్తిడి కల్పించాల్సిన అవసరమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలోపే టిఆర్ఎస్ నుంచి దూరమయ్యే పొరబాటు హరీష్ ఎప్పటికీ చేయరన్నది వారి అంచనా. చేయగలిగింది మాత్రం ఏముందని ఇవతలివారి ఎద్దేవా. ఈ ప్రచ్చన్నయుద్ధ ప్రహసనం ఇంకా చాలా కాలం చూడక తప్పదు. ఈలోగా కెటిఆర్ జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంటూ ప్రశంసలలో మునిగితేలుతుంటారు. ఒకప్పటి ట్రుబల్ షూటర్‌గా పేరొందిన హరీశ్ తన ట్రబుల్ తీర్చే వారు లేక గడ్డు కాలం నెట్టుకొస్తుంటారు. విభేదాలన్న మాట వినిపించేసరికి అదేం లేదని ఇరు శిబిరాలూ ఒకరిని మించి ఒకరు పోటీ పడి ఖండిస్తుంటారు.