ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాలను గమనిస్తే ప్రహసనాలు గుర్తుకు వస్తాయి. కొట్టుచూద్దాం అంటే కొట్టుచూద్దాం అన్నట్టు తప్ప నిజంగా తాడోపేడో తేల్చుకునేలా పోరాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ సమీకరణాలు నిర్వహణా రీతులు ఇందుకు కారణమంటున్నారు. ప్రధానపార్టీలుగా వున్న తెలుగుదేశం టిఆర్ఎస్(కొంతవరకు) బిజెపి వైసీపీ,కాంగ్రెస్ అన్నిటిదీ అదే పరిస్థితి. ఎప్పుడూ కార్మికులు రైతుల తరపున పోరాటాలు చేస్తారని పేరున్న కమ్యూనిస్టులను పక్కనపెడితే మిగిలిన వారెవరూ ఇప్పుడు ఆవేశపడిపోవడానికి సిద్దంగా లేరు. ఇందుకు అనేక కారణాలు మొదటిది- ఏ ఎన్నికలూ లేవు. రెండవది- వున్నా ఇప్పటికిప్పుడు బలాబలాలు మారవు. మూడవది- ప్రతి పార్టీ పొరుగు రాష్ట్రంలో అంతకు మించి కేంద్రంలో తమ సంగతి చూసుకోవాలి.
తెలుగుదేశం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అది కూడా ఎపిలో మాత్రమే. అక్కడ రాజధాని నిర్మాణంతో సహా చాలా సవాళ్లు వున్నాయి. స్వల్పమైన ఓట్ల తేడాతో సీట్టు కోల్పోయిన వైసీపీ ఒక్కటే ప్రతిపక్షంగా వుంది. దానికీ కేంద్రంలోని బిజెపితో సత్సంబంధాలు వున్నాయి. ఆ కారణంగా బిజెపి తమతోనే కొనసాగుతుందనే గ్యారంటీ లేదు. ప్రతిపక్షంగానే గాక ప్రత్యర్థిగా కనిపిస్తున్నందువల్ల దానితో రాజీ గాని అఖరుకు అఖిలపక్ష చర్చలు గాని కుదరవు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజావ్యతిరేకత పెరిగితే మళ్లీ బిజెపితో జట్టు కట్టక తప్పదు. పైగా ఈ పదవీ కాలంలో చాలా పనులకు నిధులకు కేంద్రంతో మంచిగా వుండాలి. అన్నిటినీ మించి తమకూ బిజెపికీ నిధులిచ్చే కార్పొరేట్లు కామన్‌గా వున్నారు. సో- బిజెపి నేతలు కొందరు ఏమన్నా తాము మౌనం వహించాల్సిందే. వైసీపీ నుంచి చేర్చుకుంటూ టీఆర్ఎస్లోకి వెళుతుంటే చూసుకుంటూ.. తెలంగాణపై ఆశలు సన్నగిల్లుతూ ఎపిలో కాపాడుకోవడానికి తంటాలు పడుతూ నిత్య కుస్తీగా.. రాజధాని నిర్మాణంతో సహా ప్రతిదీ సవాలే..చేసుకున్న ప్రచారాలు ఇచ్చిన హామీలు అమలు చేయడమే గగనమని తెలిసి కూడా గాంభీర్యంగా నెట్టుకురావాలంటే ప్రతిపక్షంపై దాడిని తీవ్రం చేయడం ప్రజా ఉద్యమాలను అణచివేయడం.. అయితే దానివల్ల మళ్లీ కొత్త అసంతృప్తి.. ఇదో వలయం..
ఇదే తిరగేస్తే వైసీపీ పరిస్థితి కూడా. జగన్ కొత్తతరం కొత్త తరహా రాజకీయ నాయకుడు. ముఖ్యమంత్రి కాలేదనే వాస్తవం ఇంకా జీర్ణించుకోలేదు. అందువల్ల ప్రతిపక్షంలో వున్నా దానికి సంబంధించిన బాధ్యతల కోసం వ్యయ ప్రయాసలు అంటే డబ్బు ఖర్చు చేయడం, ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం దండగ అనేది ఆయన ఉద్దేశం. ఏ సమస్య లోతుల్లోకి వెళ్లినా వైఎస్ పాలనా కాలంలో జరిగింది తిరగదోడతారు. ఆ కేసుల చర్చలు లోతుగా జరగడం ఇష్టం లేదు. ఆ దర్యాప్తులు ముందుకు సాగకూడదంటే కేంద్రంతో మంచిగా వుండాలి. ఇక్కడ తాను నొక్కితే బాబు బిజెపిని వారు సిబిఐని నొక్కుతారు. కనుక మాటల యుద్ధంతో లేదంటే పరామర్శయాత్రలతో సరిపెట్టాలి. ఈ లోగా పార్టీ నుంచి వెళ్లే వారిని అపగల శక్తి లేదు. ఉన్నవారితో చర్చించే ప్రజాస్వామ్య సంసృతీ లేదు. కనక చల్తీకా నాం గాడీ..మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ…
బిజెపి ఎపిలో ప్రభుత్వంలో వుంది. ప్రత్యేక హౌదా ఇవ్వకుండా ప్యాకేజీ ప్రకటించకుండా ప్రజల అసంతృప్తికి కారణమైంది. ఇప్పటికి చంద్రబాబు చెలిమి ఉపయోగకరంగా వుంది. పోగొట్టుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా వుంటుందో? అయితే ఎపి గురించి ఎక్కువగా మాట్లాడితే తెలంగాణలో నష్టం కావచ్చు. అక్కడ తమకు రావలసిన విజయం రాకపోవడానికి స్థానిక నాయకత్వ లోపం అని సాకు చెప్పారు. ఇప్పుడు ఆ నాయకత్వం మారినా పెద్ద మార్పు వుంటుందనే గ్యారంటీ లేదు. పైగా కెసిఆర్ తమతో ఘర్షణ పెట్టుకోవడం లేదు.మంచిగానే వుంటున్నారు. అలాటప్పుడు కోరి కలహం పెంచుకోవడమెందుకు? పైగా ఇప్పుడు పార్లమెంటులో ప్రతిసీటూ విలువైందనప్పుడు వీరితో మంచిగా వుంటూనే కొందరు వీర విమర్శకులను అనుమతిస్తే సరిపోతుంది కదా.. పైగా ఏ సమయంలోనూ సమస్యల మీద పెద్ద ఉద్యమాలు నిర్మించిన నేపథ్యం బిజెపికి తక్కువ. వారికి వున్నది హిందూత్వ వ్యూహం.చండీయాగంతో కెసిఆర్ తమ ఎజెండాను హైజాక్ చేస్తున్నారనే భయం ఒకటి. ఇది కొంతవరకూ చంద్రబాబు విషయంలోనూ వుంది. వచ్చే ఎన్నికల నాటికి తమ సంబంధం బాగుండకపోతే మనకు ఏమీ చేయలేదని ఉభయ ముఖ్యమంత్రులూ ప్రజలముందు ఏకిపారేస్తే ఎదురుదెబ్బ తగులుతుందేమో.
ఇక కాంగ్రెస్ ఎపిలో ఒక్కసీటూ లేదు. తెలంగాణలో కాస్త బలమున్నా బహునాయకత్వం తగాదాలు. కెసిఆర్ నిలదొక్కుకుంటుంటే ఏ నినాదంతో ఎదిరించాలో ఏకాభిప్రాయం లేని దశ. ఎపిలో ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా ఇప్పట్లో పూర్వ స్థితికి దరిదాపుల్లో చేరే అవకాశాలు నాస్తి. వైసీపీలోకి టిడిపిలోకి వెళ్లే వారిని అపలేని దశ.
కమ్యూనిస్టుల విషయానికి వస్తే ఉద్యమాలూ పోరాటాలూ నడుస్తూనే వున్నాయి. కార్మికులు ఉద్యోగులు అనేక విజయాలు కూడా సాధించుకున్నారు. అయితే రాజకీయంగా పరిమితులు. ప్రభుత్వ నిర్బంధం.. కొత్తరాష్ట్రాలలో కొనసాగుతున్న కొన్ని భ్రమల మధ్య ఇంకా పోరాటాలు ఉధృతం కావడానికి సమయం పట్టే స్థితి. జాతీయంగా అంతర్జాతీయంగా ప్రతికూలతలు పరాజయాలు శ్రేణులపై చూపిన ప్రభావం నుంచి బయిటపడి గట్టిగా ముందడుగేసే ప్రయత్నం.. సామాజిక సాంసృతికాంశాలపై గతం కన్నా ఎక్కువ కేంద్రీకరణపై ఆసక్తి..
లోక్‌సత్తా మరీ ముఖ్యంగా దాని నాయకుడైన జయప్రకాశ్ నారాయణ్ అస్తిత్వ పోరాటం.. ఆమ్ ఆద్మీపై ఆశలకు ఆరంభమే లేని స్థితి.
ఒక్క టిఆర్ఎస్ మాత్రం రాజధానితో కూడిన కొత్త రాష్ట్రం గనక కొంత దూసుకుపోతున్నట్టు కనిపించినా ఫిరాయింపులకు ప్రోత్సాహం, నిధుల కొరత, అస్పష్ట వాగ్దానాలతో ఆచరణ కొరత, మీడియాపై ఆంక్షలు, విమర్శలపై అసహనం, ఏకపక్ష పోకడలపై విమర్శలు ఎదుర్కొంటున్న దశ. పైగా బహుళ పక్ష సమ్మేళనంగా వున్న తెలంగాణలో నిరంతర ఉద్యమాల ఘోష తప్పనిస్థితి.
ఇలా మొత్తంపైన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలలో ఏదీ దూకుడుగా వెళ్లలేని స్థితి. ఉమ్మడిగా కనిపించేది పారిశ్రామిక వేత్తల రాకపోకలు ఎంవోయుల హడావుడ. ఆధ్యాత్మిక తతంగాలూ ి మాత్రమే.