తెలంగాణ బీజేపీ ప్రముఖులందరికీ అగ్నిపరీక్ష పెట్టాలని హైకమాండ్ నిర్ణయించింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై అందర్నీ పోటీకి పెట్టాలని డిసైడయింది. కేసీఆర్ పై గజ్వేల్ లో తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈటల రాజేందర్ చాలా కాలంగా చెబుతున్నారు. అంతే కాదు ఆయన గజ్వేల్ తరచూ పర్యటిస్తున్నారు. దీంతో గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి ఈటల రాజేందర్ పేరును ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో కేటీఆర్ పై సిరిసిల్లలో పోటీ చేసేందుకు బండి సంజయ్ పేరును ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.
బండి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కేటీఆర్ కు బలమైన పోటీ ఇవ్వాలంటే బండి సంజయ్ సరైన అభ్యర్థిగా భావించడంతో ఆయననే నిలబెడుతున్నారని చెబుతున్నారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ పై ఎంపీ అర్వింద్ పేరును పరిశీలిస్తున్నారు. ఆయన కూడా కేటీఆర్ పై దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కేసీఆర్, కేటీఆర్ లపై మాత్రమే కాకుండా.. బీఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్న వారందరిపైనా బీజేపీ ముఖ్య నేతలు పోటీ చేయనున్నారు. హరీష్ రావుపై సిద్దిపేటలో మాజీ ఎంపీ బూర నర్సయ్య్ గౌడ్ ను నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణను పోటీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ నేతల్లో మంత్రులపై పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు హైకమాండ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. అయితే కిషన్ రెడ్డి ఎవరిపై పోటీ చేస్తారన్నది స్పష్టతలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి కూడా పోటీ చేయడం ఖాయం. అయన తన సేఫ్ సీటులోనే పోటీ చేస్తారా లేకపోతే ఎవరైనా ప్రముఖ నేతలపై పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.