ప్చ్… టాలీవుడ్ కి దిష్టి తగిలింది. రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి.. ఇలా వరుస విజయాల్ని చూసిన తెలుగు చిత్రసీమ ఇప్పుడు.. ఫ్లాపుల భారం మోయాల్సివస్తోంది. మహానటి తరవాత ఒక్కటంటే ఒక్క క్లీన్ హిట్ లేదు. సమ్మోహనం ఓకే అనిపించినా.. మాస్ కి చేరువ కాలేదు. ఈ నగరానికి ఏమైంది.. మల్టీప్లెక్స్‌కే పరిమితమైంది. ప్రతీవారం రెండు మూడు సినిమాలొస్తున్నా- ఒక్కటి కూడా బాక్సాఫీసు దగ్గర నిలబడడం లేదు.
ఓ హిట్ సినిమా చూద్దామన్న సగటు ప్రేక్షకుడి ఎదురు చూపులు… ఫలించడం లేదు. మెహబూబాతో మొదలైన ఈ ప్లాపుల యానం… `తేజ్` వరకూ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రెండు నెలల నుంచి టాలీవుడ్‌కి ఓ హిట్టు లేకుండా పోయింది. మరింత భయంకరమైన నిజం ఏమిటంటే.. ఈ ఫ్లాపుల్లో డిజాస్టర్లు ఎక్కువగా ఉండడం.
మెహబాబూ, ఆఫీసర్, నేల టికెట్టు, రాజుగాడు, కాలా, నా నువ్వే, జంబలకిడి పంబ.. ఇవన్నీ డిజాస్టర్లే. ఈ సినిమాలు నిర్మాతలతకు, బయ్యర్లకు భారీ నష్టాల్ని మిగిల్చాయి. ఈ వారం విడుదలైన గోపీచంద్ పంతం, సాయిధరమ్ తేజ్ – తేజ్ ఐ లవ్ యూ ఫ్లాపుల జాబితాలో చేరిపోయాయి. ఏ రేంజు ఫ్లాపులన్నది తేలాలంటే మరో రెండు మూడు రోజులు గడవాల్సిందే. ఆగస్టు నుంచి వర్షాకాలం మొదలైపోతుంది. ఇప్పటికే ముసురు పట్టడం మొదలైంది. వర్షాకాలం టాలీవుడ్‌కి బ్యాడ్ సీజన్. హిట్ సినిమాలొచ్చినా… థియేటర్లు నిండడం కష్టం. రాబోయే రోజుల్లోనూ `చూసి తీరాల్సిందే` అనిపించదగిన సినిమాలేం లేవు. చిన్న సినిమలు, మీడియం రేంజు హీరోల సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు రావాలంటే దసరా వరకూ ఆగాల్సిందే. ఈలోగా చిన్న సినిమాలేమైనా అద్భుతాలు చేస్తే తప్ప… టాలీవుడ్లో కాసుల కళకళలు, రికార్డుల తళతళలు కనిపించవు.