తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ అదే పనిగా సాగదీస్తోంది. ఆరు నెలల పాటు సాధన చేసి మూలన ఉన్న ముసలమ్మను కొట్టినట్లుగా… తీరిగ్గా… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిగం ఠాగూర్ ఓ ప్రకటన చేశారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్‌ను ఖరారు చేస్తారని.. అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న చీఫ్.. వర్కింగ్ చీఫ్‌లు పని చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో.. కొత్త నాయకత్వంలో జోరుగా పని చేసుకుందామని ఆశించిన కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురయింది. రేవంత్ ను వ్యతిరేకిస్తున్న వర్గం.. పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పుడే వద్దని… నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత ఖరారు చేయాలని హైకమాండ్ కు లేఖలు రాసింది.
జగ్గారెడ్డి లాంటి వారు మీడియా సమావేశం పెట్టి మరీ… ఈ విషయాన్నే చెప్పారు. దీన్నే కాంగ్రెస్ హైకమాండ్ పరిగణనలోకి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పీసీసీ చీఫ్ ఎంపికను వాయిదావేశారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వర్గం.. తక్షణం ఆయనను పీసీసీ చీఫ్‌గా ప్రకటించాలని కోరుకుంది. ఆయన వ్యతిరేక వర్గం.. ప్రకటన చేయకపోయినా పర్వాలేదు… ఎంత ఆలస్యం అయినా పర్వాలేదనుకుంటోంది. మరో వైపు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి విషయంలో.. గట్టిగా నిర్ణయం తీసుకోలేకపోతోంది. సీనియర్లను ఏదో విధంగా బుజ్జగించడానికి ప్రయత్నిస్తోంది. దీంతో సమస్య పీట ముడిపడిపోయింది. మధ్యేమార్గంగా.. రేవంత్ రెడ్డికి సపోర్టర్‌ని పీసీసీ చీఫ్‌గా కూర్చోబెట్టి ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇద్దామనుకున్నా… సాధ్యం కాలేదు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. తన వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ క్లూ లెస్‌గా మారిపోయింది. ధైర్యంగా ఏ నిర్ణయమూ తీసుకోలేక,.. మళ్లీ వాయిదావేసుకుంది. నాగార్జున సాగర్‌లోనూ పరువు పోయిన తరవాత తీరిగ్గా… అధ్యక్షుడ్ని ప్రకటించుకుని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోందని … కాంగ్రెస్ వీరాభిమానులు ఆవేదన చెందుతున్నారు.