తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అనేక సంప్రదింపులు.. సమాలోచనల తర్వాత తెలంగాణ పీసీసీ బాస్ ఎవరనే దానిపై అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. సామాజిక సమీకరణాలు.. విధేయత ఆధారంగా కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రస్థాయిలో లాబియింగ్ కొనసాగించారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీలు పోటీ పడగా.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్..ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతోన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయిందని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది.
Also Read : పాపం బీఆర్ఎస్ నేతలు!
మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని రేవంత్ సైతం బలపర్చారని దాంతో కొద్ది రోజుల్లోనే అధిష్టానం అధికారిక ప్రకటన చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ , అధిష్టానం మాత్రం పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది. ఎంపీ బలరాం నాయక్ వైపు హైకమాండ్ మొగ్గు చూపిందని తెలుస్తోంది. గతంలో కేంద్రమంత్రిగా కూడా పని చేసిన బలరాం నాయక్ కు కాంగ్రెస్ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉండటంతోపాటు పార్టీకి విధేయుడిగా ఆయనకు పేరుంది.
ఆయన విధేయతను పరిగణనలోకి తీసుకొని దాదాపుగా బలరాం నాయక్ పేరును ఖరారు చేశారని.. రేవంత్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ఈ నెల 15న అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు.