తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించడానికి హైకమాండ్ తంటాలు పడుతోంది. రేవంత్ ను ఇబ్బంది పెట్టని బీసీ నేతను ఎంపిక చేయాలని నిర్ణయించారు. చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గారని లీకులు ఇచ్చారు. కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా తమకు చాన్సివ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 27న ప్రస్తుత అధ్యక్షులు, సీఎం రేవంత్‌రెడ్డి మూడేండ్ల గడువు ముగిసింది అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్యాయం జరిగిందనే అపవాదు పార్టీల్లో నెలకొంది. దీన్నించి బయటపడేందుకు ఈసారి పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మధుయాష్కీగౌడ్ రాహుల్ తో తనకు ఉన్న పరిచయాలతో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
రెడ్డి సామాజికతరగతికి సంబంధించిన నేత ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆ పదవి ఆవర్గాలకు వచ్చే అవకాశం లేదనే చెప్పవచ్చు. మొత్తంగా కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అభిప్రాయాలే కీలకంగా మారనున్నాయి. బుధవారం రేవంత్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఏకాభిప్రాయం రాకపోతే ..ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉంది.