తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి పందారం రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. ఈ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెడతారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ఈ పదవిని ఆశిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల మధ్య పోటీ తీవ్రతరం అవుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో వాగ్దాటి కలిగిన సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డికి పార్టీ సుప్రీం రాహుల్ గాంధీ అండదండలు ఉన్నాయని ప్రచారం కూడా జరిగింది. అయితే ఎందుకో కానీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించలేదు. దీంతో మరో సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును చంపేయాలి అంటూ తీవ్ర ప్రకటనలు చేసి కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని ఆకర్షించాలని కూడా ప్రయత్నించారు. పీసీసీ అధ్యక్ష పదవి తననే వరిస్తుందని, తనకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని కూడా ప్రకటించారు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగా మారింది. తాజాగా శుక్రవారం నాడు మరో సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి తాను పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉమేష్ చాందీ, అహ్మద్ పటేల్, చిదంబరం వంటి సీనియర్ నాయకుల ఆశీస్సులు తనకే ఉన్నాయని ప్రకటించారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం తాను సీరియస్ గా ప్రయత్నిస్తున్నానని ముక్తాయింపు కూడా ఇచ్చారు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి రెడ్డి వర్సెస్ రెడ్డిగా మారింది. ఇదిలా ఉంటే అధిష్టానం మాత్రం ఈసారి పీసీసీ పదవిని బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అంతేకాదు పార్టీ అధ్యక్షుడిగా ఒకరిని, కార్యనిర్వాహక అధ్యక్షులు గా మరో ఇద్దరిని నియమించే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.