తెరాస ప్లీనరీ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పై సీఎం కేసీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బస్సు యాత్ర చేస్తూ మతిలేకుండా మాట్లాడుతున్నారనీ, ప్రగతి భవన్ లో 150 గదులుంటే వచ్చి చూసుకోవచ్చని కూడా సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమం కారణంగానే ఉత్తమ్ కు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందనీ, లేదంటే ఆంధ్రుల సంచుల మోయాల్సి ఉండేదని కూడా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణా రాష్ట్రాన్ని ఆంధ్రులకు తాకట్టుపెట్టింది కేసీఆర్ మాత్రమే అని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ అనే మాస్క్ పెట్టుకుని, కేసీఆర్ కుటుంబం అవినీతి చేస్తున్నారని విమర్శించారు. ‘ఎవడి అబ్బ సొమ్ము, ఎవడి జాగీరు అనుకుని… రూ. 500 కోట్ల విలువైన స్థలంలో రూ. 60 కోట్లతో ఇల్లు కట్టుకుంటావ్..? అప్పటికే ముఖ్యమంత్రి అధికార నివాసం ఒకటున్నది. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉండాలి. ఇంత విలాసవంతమైన ఇల్లు కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవ్వడూ ఉండడు’ అన్నారు. 150 గదుల సంగతి తానెప్పుడూ మాట్లాడలేదనీ, అమూల్యమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే మొదట్నుంచీ చెప్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణం చేసే కార్లు ఒక్కోటీ కోట్ల రూపాయల్లో ఉంటున్నాయన్నారు. మొదట్లో నల్లరంగు కార్లలో తిరిగేవారనీ, ఆ తరువాత తెల్ల రంగుల కార్లకు మార్చారనీ, ఇప్పుడేమో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో తిరుగుతున్నారన్నారు.
ఇవన్నీ అవసరమా, ఒక సామాన్యుడిగా మీరు బతకలేరా అంటూ ఉత్తమ్ మండిపడ్డారు. సొంత కార్యక్రమాలను ప్రైవేట్ చార్టర్ జెట్లను వాడుతున్నారనీ, ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం అవునా కాదా అంటూ ప్రశ్నించారు. సో.. నిన్న ప్లీనరీలో కేసీఆర్ చేసిన విమర్శలపై ఉత్తమ్ ఇలా స్పందించారు. నిజానికి, ముఖ్యమంత్రి నివాస నిర్మాణమూ, ఖరీదైన కాన్వాయ్ వంటి అంశాలు చూసేవారికి కూడా కాస్త అతిగానే కనిపిస్తున్నాయి. అధికార నివాసం ఉంటుండగా మరో ఖరీదైన ఇంటి నిర్మాణం, సచివాలయం ఉండగా మరోచోట అత్యాధునిక సదుపాయాల భవనం అవసరమని కేసీఆర్ సర్కారు ప్రతిపాదించడం.. వాస్తు కారణాలతో అధికారిక భవనాలను వినియోగించకపోవడం… ఇవన్నీ కేసీఆర్ ను ఇరుకునపెట్టే అంశాలే.