బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ సారి ఎన్నికల సన్నాహాల విషయంలో అంత చురుకుగా ఉండటం లేదు. ప్రతీ సారి ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన భారీగా ఆయుత చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి అలాంటి ఆలోచనలు చేయలేదు. కానీ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించి ముఖ్యమంత్రి అయిపోదామని ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి మాత్రం కొడంగల్‌లోని తన స్వగృహంలో చండీయాగం పూర్తి చేసేసేశారు.
మూడు రోజుల పాటు నిర్వహించిన యాగానిక ిచివరి రోజు కుటుంబ సమేతంగా వెళ్లారు. యాగం చేశారు. తెలంగాణకు మంచి రోజులు రావాలని.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యాగం చేసినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి గతంలో ఇలాంటి యాగాలు చేయలేదు. కానీ ఈ సారి మాత్రం ఆయన కేసీఆర్ లాగే ఆలోచించారు. ఎన్నికల షెడ్యూల్ మరో వారం, పది రోజుల్లో వస్తుందనగా యాగం పూర్తి చేశారు.
మరో వైపు ఈ సారి బీఆర్ఎస్ వర్గాలకు యాగంపై క్లారిటీ లేదు. సీఎం కేసీఆర్ కు ప్రస్తుతం వైరల్ ఫీవర్ కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే శుక్రవారం నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీని కూడా వాయిదా వేశారు. షెడ్యూల్ వచ్చేలోపు కేబినెట్ భేటీని నిర్వహించి.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలను మించిన మేనిఫెస్టోను ప్రకటించాలని అనుకుంటున్నారు.