ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ఆతర్వాత టీడీపీకి కంచుకోట! కానీ, గత ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలనూ టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఈ సారి పూర్వ వైభవాన్ని చాటేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజమాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. ఆయనను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, కాంగ్రెస్ లో చేరిన టీడీపీ నేత అరికెల నర్సారెడ్డి పోటీ పడుతున్నారు. వీరిలో తనకు అధిష్ఠానం నుంచి హామీ ఉందని భూపతిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్లారెడ్డి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే రవీందర్రెడ్డినే టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున గతంలో పోటీ చేసిన నల్లమడుగు సురేందర్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సీటును… టీజేఎస్‌కు కేటాయిస్తారని… న్యాయవాది రచనారెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది.
బోధన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌నే ప్రకటించారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయం. ఆయనకే టికెట్ దాదాపు ఖరారు కావడంతో నెల రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఆర్మూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ప్రకటించారు. ఇక్కడి నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరడంతో కాంగ్రె్‌సలో ఆశావహుల సంఖ్య పెరిగింది. కాంగ్రెస్ టికెట్ కోసం ఎమ్మెల్సీ ఆకుల లలిత, రేవంత్ అనుచరుడు రాజారాం ప్రయత్నిస్తున్నారు. బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి మాజీ విప్ అనిల్ పోటీ పడుతున్నారు. కూటమినుంచి టీడీపీ తరఫున మల్లికార్జున్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణ జాగృతి మాజీ అధ్యక్షుడు ఆరెంజ్ సునీల్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తను ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి మహేశ్ కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెన్బిన్ హుందాన్, నరాల రత్నాకర్, కేశ వేణు, గడుగు గంగాధర్ టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి టికెట్ వచ్చినా సహకరించి గెలిపించుకునేందుకు సమన్వయ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి డీఎస్ ప్రాతినిధ్యం వహించినందున ఈ దఫా ఆయన రాకపై చర్చ సాగుతోంది. కామారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్.. కాంగ్రెస్ తరఫున శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ బరిలోకి దిగుతున్నారు. షబ్బీర్ అలీ గతంలో పలు దఫాలు ఎమ్మెల్యేగా పని చేశారు. మంత్రి పదవులను నిర్వహించారు. మైనారిటీ నేతగా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. దీంతో, ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉండనుంది.బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున గతంలో పోటీ చేసిన కాసుల బాల్‌రాజ్ ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు… తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంలో తమపై వ్యతిరేకత ఓటంగ్ లో పడకుండా.. తాజా మాజీఎమ్మెల్యేలు కొత్త వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల అధికారిక ప్రకటన తర్వాత… నిజామాబాద్ రాజకీయంలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.