సంక్రాంతి సమరానికి బాలయ్య,చిరు రెడీ అయ్యారు. ఈ రెండు చిత్ర బృందాలూ `పోటీ` అనుకొన్నా, కాకపోయినా… ఫ్యాన్స్ మాత్రం ఈ సంక్రాంతి బాలయ్య, చిరుల మధ్య పోటీగానే భావిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్లూ ఫిక్సయిపోయాయి. బాలయ్య 12న వస్తుంటే, అంతకంటే ముందు అంటే 11న చిరు రంగంలోకి దిగిపోతున్నాడు. నిజానికి తెలుగు సినిమాలు గురు, శుక్రవారాల్లో రిలీజ్ అవుతాయి. కానీ… ఖైదీ మాత్రం సెంటిమెంట్‌కి విరుద్దంగా బుధవారమే దిగిపోతున్నాడు. దీన్ని బట్టి.. పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది.
ఒకరోజు ముందు రావడం చిరంజీవికే లాభమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే అసలు పండుగ శుక్రవారం మొదలవుతుంది. ఆ హడావుడి శని, ఆదివారాలూ ఉంటాయి. సినిమా విడుదలరోజున ఖైదీకి ఎలాగూ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి. 12న తేదీన ఆ తాకిడి తగ్గినా… మళ్లీ 13, 14, 15వ తేదీల్లో విజృంభించొచ్చు. `పండగ మన సినిమాతోనే మొదలవ్వాలి..` అంటూ చిరు ఫ్యాన్స్ చిత్రబృందంపై గట్టి ఒత్తిడి తెచ్చింది. అది… ఫలించింది కూడా. చిరు చేతిలో 5 రోజులున్నాయి. సినిమా ఏమాత్రం బాగున్నా తొలి వారమే బ్రేక్ ఈవెన్‌లో పడిపోవొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి… చిరు సినిమాని పాజిటీవ్ కోణంలో చూసే అవకాశం ఉంది. గౌతమి పుత్ర ఏమాత్రం అటూ ఇటూ తేడా కొట్టినా.. మిగిలిన రోజుల్లో చిరు దూకుడుని ఆపడం ఎవ్వరి వల్లా కాదు. అలాగని చిరుకే ఫేవర్ అని చెప్పడానికి వీల్లేదు. చిరు సినిమా అంచనాలకు దగ్గరగా రాకపోతే…. బాలయ్య సినిమా ఎలాగున్నా.. పండగ చేసుకోవడం ఖాయం. కాబట్టి చిరు సినిమాకీ రిస్క్ ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రెండు సినిమాల అవుట్ పుట్ చాలా బాగా వచ్చినట్టే. కాబట్టి… ఏ సినిమాకా సినిమానే బాక్సాఫీసు దగ్గర పంజా విప్పే ఛాన్సుంది. ఒక రోజు ముందే చిరు రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి వసూళ్ల పరంగా చిరు పై చేయి సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.