హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాయకుడి నిమజ్జనం సందర్భంగా నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
ఖైరతాబాద్ మహా గణపతి , బాలాపూర్ గణనాథుల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. మంగళవారం మాస్ ట్యాంక్ దాటి వీవీ స్టాచ్యూ , క్లాక్ టవర్ , చిలకలగూడ , చాదర్ ఘాట్ , ఐఎఎస్ సదన్ , వైఎంసీ నారాయణగూడ , తార్నాకదాటి ఆర్టీసీ బస్సులు నగరంలో లోపలికి ఎంటర్ కావని వెల్లడించారు. జిల్లాల నుంచి బస్సులు కూడా నగరంలో లోపలికి అనుమతించమని, నగర ప్రజలు గమనించాలని చెప్పారు.
ఇక, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వచ్చే వారు నెక్లెస్ రోడ్ , ట్యాంక్ బండ్ దారుల్లో కాకుండా ఇతర మార్గాల గుండా వెళ్లాలన్నారు. హైదరాబాద్ నుంచి విమానాశ్రయంకు వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఎయిర్ పోర్టు చేరుకోవాలని కోరారు.
ఇక, చాంద్రాయణగుట్ట, క్రాస్ రోడ్స్ , ఇంజిన్ బౌలీ , శంశీర్ గంజ్ , నాగుల్ చింత , హిమ్మత్ పురా , హరిబౌలి , మొగుల్ పుర, లక్కడ్ కొటే , పంచ మొహలా , మదీన్ క్రాస్ రోడ్స్ , నయాపూల్ , సిటీ కాలేజ్ , అప్జల్ గంజ్ , ట్రూప్ బజార్ , జాంబాగ్, రోడ్ , కోఠి ఆంధ్రా బ్యాంక్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. రాణిగంజ్ , తెలుగు తల్లి విగ్రహం, కవాడిగూడ , నారాయణ గూడ క్రాస్ రోడ్ , ఆర్టీసీ క్రాస్ రోడ్స్ , ముషీరాబాద్ క్రాస్ రోడ్స్ , నెక్లెస్ రోడ్ , పీపుల్స్ ప్లాజాలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
మరోవైపు.. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. అర్దరాత్రి కలశపూజ అనంతరం ట్రాలీ ఎక్కించి శోభా యాత్రను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన నాలుగో నెంబర్ క్రేన్ దగ్గర ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేయనున్నారు.