టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరు పర్యటనలో వివాదం చోటు చేసుకుంది. ఆయన కందుకూరులో రోడ్ షో కు జనం వెల్లువలా వచ్చారు. ఆ సమయంలో రోడ్డు సరిపోకవడంతో కాలువ అంచున కొంత మంది నిలబడ్డారు. తోపులాట చోటు చేసుకోవడంతో చాలా మంది కాలువలో ఒకరి మీద ఒకరు పడిపోయారు. దీంతో ఏడుగురు చనిపోయారు. ఉన్న పళంగా అందర్నీ ఆస్పత్రికి తరలించినా వారి ప్రాణాలు దక్కలేదు. మరికొంత మంది గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు ప్రసంగం ఆపేశారు. ఆస్పత్రికి వెళ్లారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు, వారి ఫ్యామిలీస్‌కి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తమకు చెందిన ట్రస్టుల నుంచి వారి పిల్లల చదువులు లాంటి అవసరమైనన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు.
సభకు హాజరైన వారు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. చనిపోయిన వారి కోసం సభ వద్ద మౌనం పాటించారు. ఆ తర్వాత రాజకీయ అంశాలను చంద్రబాబు ప్రసంగించలేదు. చంద్రబాబు సభలకు ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రెండు సార్లు మాత్రమే గెలిచిన కందుకూరులోనూ ఊహించనంత మంది వచ్చారు. ఓపెన్ కాలువులు ఉండటం పెను శాపం అయింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఏడుగురు కార్యకర్తల్ని కోల్పోయింది.