సమస్యలు చెప్పుకోవడానికి ఓ వ్యక్తి లేఖ రాస్తాడు. ఎవరికి రాస్తాడు. ఎవరికి చెప్పుకోవాలనుకుంటున్నాడో వారికి రాస్తారు. సమస్యలు చెప్పుకోవాల్సిన వ్యక్తి.. పరిష్కరించాల్సిన వ్యక్తి ఒకరే అయితే ఏం చేస్తారు..? తమ పరిధి మేరలో సమస్యను పరిష్కరించుకుంటారు. కానీ లేఖలు రాసుకుని.. వాటిని మీడియాలో ప్రచారం చేసుకుని ఏదో లక్ష్యం నెరవేర్చుకోవాలని ప్రయత్నించరు. కానీ ఏపీ ప్రభుత్వంలో పాలన అంతా… పేపర్లపై సాగుతూ ఉంటుంది. ఈ లేఖల ప్రసహసనం కూడా అంతే.
ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ పేరుతో ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్‌కు ఓ లేఖ వచ్చింది.ఈ లేఖ సారాంశం ఏమిటంటే ట్రాన్స్ కో ఉద్యోగులు, యాజమాన్యం మధ్య అపోహలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ.. ఉద్యోగుల కోసం ట్రాన్స్‌కో ఏం చేస్తుందో.. ఎంత చేస్తుందో వివరిస్తూ ఆ లేఖ ఉంది. ట్రాన్స్ కో ఉద్యోగులకు ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ చేయాలి. అదే చేయడం లేదు. అందుకే ఉద్యోగులు రగిలిపోతున్నారు. వారికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్ కో యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు పోరుబాట పట్టే యోచనలో ఉన్నాయి.
అందుకే ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ పరిస్థితిని విమర్శిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్‌కు లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు కూడా అందుబాటులోకి వచ్చారు. పాపం శ్రీకాంత్‌కు ఎన్ని కష్టాలు వచ్చాయో అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే… ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ రాసిన లేఖ అందుకున్న ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ .శ్రీకాంత్ వేర్వేరు కాదు. ఒక్కరే. రెండు ఒకచోట ఇంటి పేరు పెట్టి.. మరో చోట షార్ట్ నేమ్‌తో లేఖలు రాశారు. దాంతో వేర్వేరు అనుకుంటారు. కానీ ఒక్కటే. అంటే.. శ్రీకాంత్‌కు.. శ్రీకాంత్ లెటర్ రాసి సమస్యలుచెప్పుకున్నారు. దాన్ని మీడియాలో వచ్చేలా చేసుకున్నారు. దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటో.. ఉద్యోగులు కుట్ర భావించే ప్లాన్లేమిటో ముందు ముందు బయటపడే అవకాశం ఉంది.