ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హఠాత్తుగా.. కొంత మంది సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులను బదిలీ చేసింది. మిగతా అధికారుల సంగతేమో కానీ..ముక్కుసూటి మనిషిగా పేరున్న ఈ సీనియర్ సురేంద్రబాబు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయనను.. ఉన్న పళంగా బదిలీ చేసి .. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
అటు సురేంద్రబాబును అలా ట్రాన్స్ ఫర్ చేసి.. డీజీపీ ఆఫీసుకు పంపగానే.. ఇటు ఆర్టీసీ నుంచి 350 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. ఎలక్ట్రిక్ బస్సులు అనగానే.. సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేఘా కంపెనీనే గుర్తుకు వస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ లో రూ. 700 కోట్ల వరకూ డిస్కౌంట్ ఇచ్చి పనులు చేసేందుకు అంగీకరించినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం.. మేఘా కృష్ణారెడ్డికి చెందిన కంపెనీ నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి.. ఆ కంపెనీ నెట్ వర్త్ ను పెంచేందుకు సహకరించబోతోందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే టెండర్లు పిలిచే సమయానికి.. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును సంస్థ నుంచి బయటకు పంపారు.
ఆర్టీసీ నష్టాల బాట నుంచి బయట పడేసేందుకు ఎస్వీ సురేంద్రబాబు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఎండీగా నియమితులైన ఆయన… సంస్థ నష్టాలను కారణాలు వెదికి… దుబారా తగ్గించి.. వీలైనంతగా జవాబుదారీ తనం పెంచే ప్రయత్నం చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా.. సురేంద్రబాబుకు.. అధికారవర్గాల్లో పేరుంది. ఆయన ఉంటే.. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లు తాము అనుకున్న వాళ్లకి దక్కేలా చేయలేమని అనుకున్నారేమో కానీ ఉన్నపళంగా ట్రాన్స్ ఫర్ చేసేశారన్న గుసగసలు సెక్రటేరియట్లో బహిరంగంగానే వినిపిస్తున్నాయి.