చిత్తూరు ఎంపీ శివప్రసాద్ .. రోజుకో వేషంతో…పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు సందడి చేశారు. మీడియా అటెన్షన్ పొందారు. ఈ వేషాలు చూసి.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు మహా కోపం వచ్చింది. వెంటనే.. ఆయన పార్లమెంట్ భద్రతకు కూడా.. ముప్పు తెచ్చి పెడుతున్నారన్న రీతిలో .. లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనలు వ్యక్తం చేస్తే చర్యలు ఎలా తీసుకుంటారో జీవీఎల్ చెప్పలేదు. ఇప్పుడు శివప్రసాద్ వేసిన వేషాలు.. జీవీఎల్‌కే కాదు… హిజ్రాలకు కూడా కోపం తెప్పించారు. ట్రాన్స్జెండర్లు అయిన వారి వేషం… శివప్రసాద్.. వేయడమే దీనికి కారణం.
శివప్రసాద్ వేసిన హిజ్రా వేషమే ఇప్పుడు ఆ ఎంపీ కొంప ముంచింది. ఒక ఎంపీ అయ్యి ఉండి.. హిజ్రాలను అవమానపరిచే విధంగా ఆయన ప్రవర్తించారని..వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. హిజ్రాలను అవమానపరిచే రీతిలో వెకిలి చేష్టలు చేసిన శివప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ కూడా చేస్తున్నారు. వాళ్లే కాదు.. ఇటీవల శ్రీరెడ్డి అనే నటీమణి ఇష్యూలో తెరపైకి వచ్చిన తమన్నా అనే హిజ్రా కూడా విజయవాడలో శివప్రసాద్ పై ఫిర్యాదు చేసింది. తాను ఆపరేషన్ చేయించుకుని అవయవాలు అన్నీ మార్చుకుని.. ఆడవాళ్లలానే బతుకుతున్నామని అయినా శివప్రసాద్ ఆవమానించారనేది ఆమె అభియోగం.
తనపై వస్తున్న ఫిర్యాదుల విషయంలో… శివప్రసాద్ ఇంకా స్పందించలేదు. కానీ ఆయన మాత్రం తనను ఓ కళాకారుడిగా చూడాలని.. ఎవర్నీ కించ పరచడం తన ఉద్దేశం కాదని.. ముందు నుంచీ చెబుతున్నారు. హిజ్రాలకు ఆయన ఏమైనా వివరణ ఇస్తారో. సైలెంట్‌గా ఉంటారో వేచి చూడాలి. కొద్ది రోజుల కిందట… హిజ్రాలు.. పెన్షన్ ప్రకటించారని.. చంద్రబాబుకు నంద్యాలలో గుడి కట్టించారు. ఇప్పుడు వారే టీడీపీ ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.