ప్రముఖ రచయిత, కేరళలో ట్రావన్కోర్ రాజవంశస్థుడు అయిన శ్రీకుమార్ వర్మ(61)ని పశ్చిమ ఆఫ్రికాలో సెనెగల్ పట్టణంలో కిడ్నాప్ చేయబడ్డారు. అక్కడ ఒక కార్యక్రమానికి హాజరు అవడానికి వెళ్ళిన ఆయన బుదవారం సాయంత్రం చేరుకోవలసి ఉంది. కానీ అక్కడికి చేరుకోలేదు. ఇంతవరకు ఆయన ఎవరికీ ఫోన్ కూడా చేయకపోవడంతో స్థానిక పోలీసులకి పిర్యాదు చేయగా వారి దర్యాప్తులో ఆయనను ఎవరో కిడ్నాప్ చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ కూడా దృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఆచూకీని కనిపెట్టి, ఆయనను కాపాడటమే తమ ప్రధమ కర్తవ్యం అని వికాస్ స్వరూప్ తెలిపారు.
సెనెగల్ పోలీసులు ఇంతవరకు సుమారు 900 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇంతవరకు ఆయన ఆచూకి తెలియలేదు. మంచి పర్యాటక కేంద్రంగా పేరు గాంచిన సెనెగల్ పట్టణంలో ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరుగలేదు కానీ దానికి సమీపంలోనే బుర్కినా ఫాసో పట్టణంలో గల రాడిస్సన్ బ్లూ అనే స్టార్ హోటల్ పై కొన్ని రోజుల క్రితమే ఉగ్రవాదులు దాడులు జరిగాయి. అప్పటి నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లేవారు తమ స్వీయ రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా, ఇంగ్లాడ్ దేశాలు హెచ్చరికలు జారీ చేసాయి. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో డబ్బు కోసం విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేయడం సర్వసాధారణం అయిపోయిందని తెలుస్తోంది.
శ్రీకుమార్ వర్మ 2010లో వ్రాసిన మెరియా’స్ రూమ్ అనే నవల మ్యాన్ ఆఫ్ ఏసియా మరియు క్రాస్ వర్డ్ ప్రైజ్ కి ఎంపికయ్యాయి. అది కాక ఆయన అనేక నాటికలు, బాలల కోసం అనేక పుస్తకాలు రచించారు. చెన్నైలోని సృజానాత్మక ఇంగ్లీష్ మరియు గణిత శాస్త్ర ఇన్స్టిట్యూట్ లో సుమారు 13ఏళ్ల పాటు ప్రొఫెస్సర్ గా పనిచేసారు. మద్రాస్ క్రీస్టియన్ కాలేజిలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా చాలా కాలం పనిచేసారు. ఆయన రచనలకు గుర్తింపుగా ఆర్.కె.నారాయణ్ అవార్డును కూడా అందుకొన్నారు.
శ్రీకుమార్ వర్మ చెన్నైలో ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని నీలాంకరై అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన తల్లి పేరు ఇంద్రాభాయి. ఆమె ఒకనాటి ట్రావన్ కోర్ సంస్థానానికి మహారాణి సేతు లక్ష్మి భాయి కుమార్తె. శ్రీకుమార్ భార్య పేరు గీత. ఆ దంపతులకి వినాయక్, కార్తీక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కిడ్నాప్ అయిన విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు.