భారత దేశంలో చెట్లు అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఈ విషయాన్ని ఆర్భర్ డే ఫౌండేషన్ అనే సంస్థ ధృవీకరించింది. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేస్తుంది. హైదరాబాద్కు దక్కిన ఈ ఘనత గురించి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించారు. దేశంలో మరే నగరానికి ఈ ఘనత దక్కలేదని ఆయన ఘనంగా ప్రకటించారు. దేశంలో ఐఎఫ్ఓఎస్ గుర్తింపు పొందిన.. ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వించదగ్గ విషయమని .. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి దక్కిన ఫలితమే ఇదని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో తెలంగాణ సర్కార్ వివిధ కార్యక్రమాల ద్వారా 2 కోట్ల నలభై లక్షల మొక్కలు నాటింది. వీటిలో అత్యధికం హరిత హారం ద్వారానే నాటారు. ఈ కారణంగా హైదరాబాద్లో పచ్చదనం పెరిగింది. అత్యధిక మొక్కలు… చెట్లుగా మారి .. హైదరాబాద్లో కాలుష్య స్థాయిని తగ్గించడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో పచ్చదనం పెంపుపై సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన ఆసక్తితో ఉన్నారు. పెద్ద మొత్తం వెచ్చించి మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తూంటారు. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. గ్రేటర్ చట్టంలో ఇందు కోసం ప్రత్యేక సెక్షన్లు కూడా పెట్టారు.
అలాగే పంచాయతీలు, మున్సిపాల్టీల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణ, పురపాలక మంత్రిగా హైదరాబాద్ విషయంలో కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని ఆయన జాగ్రత్తగా డిజైన్ చేస్తూంటారు. మంచినీటి సమస్యను దాదాపుగా తీర్చేసేలా ప్రణాళికలు అమలు చేసిన కేటీఆర్ ఇప్పుడు… పచ్చనంపై స్పెషల్ టాస్క్ పెట్టుకున్నారు. ఈ విషయంలో ఫలితం వచ్చింది. హైదరాబాద్ దేశంలోనే ఏకైక ట్రీ నగరంగా నిలిచింది.