కేంద్రం యొక్క చివరి బడ్జెట్ కూడా అయిపోయింది. ఎపి కి వస్తాయనుకున్న ప్రత్యేకహోదా, వైజాగ్ రైల్వే జోన్, ఇంకా మరిన్ని విభజన హామీలు.. ఏవీ కూడా ఇక నెరవేరనట్టే. బిజెపి కి టిడిపికి మధ్య ఈ మాధ్యన జరుగుతున్న మాటల మంటల నేపథ్యం లో, ఈ ఆదివారం జరగనున్న సమన్వయ సమావేశం లో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ఎపి కి సంబంధించి రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయా? అవునంటున్నారు విశ్లేషకులు.
టిజి వెంకటేష్ ఇవాళ మాట్లాడుతూ, నాలుగు దశల్లో టిడిపి పోరాటం ఉంటుందని అన్నారు. మొదటి దశలో కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని, తర్వాత పార్లమెంటులోనూ, బయటా ఎంపీలు పోరాటం చేస్తారని, మూడవ దశలో టిడిపి ఎంపీలు రాజీనామా చేస్తారని, చివరి దశలో పూర్తిగా బిజెపి తో తెగదెంపులు ఉంటాయనీ ఆయన అన్నారు. పూర్తి మెజారిటీ ఉండటం తో బిజెపి పొగరుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. నిన్న జెసి కూడా బిజెపి ని తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో ఆదివారం జరగనున్న టిడిపి సమావేశం లో స్పష్టమైన కార్యాచరణ, చంద్రబాబు నుంచి ఎంపీలకి దిశానిర్దేశం రానునదని తెలుస్తోంది.
మొత్తానికి టిడిపి వైఖరి, కార్యాచరణ విషయం లో పూర్తి స్థాయి స్పష్టత ఈ ఆదివారానికి రానుంది. ఒకవేళ టిడిపి బిజెపి తో తెగదెంపుల దిశగా సన్నద్దమైతే, పూర్తిగా రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందనడం లో సందేహం లేదు. గతం లో లాగా మళ్ళీ దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పే రోజులు వస్తాయని టిజీ వ్యాఖ్యానించడం విశేషం!