జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. సీబీఐ కేసుల కన్నా ఈడీ కేసులు ముందుగా విచారణ జరపాలంటూ హైకోర్టులో ఆయన పెట్టుకున్న పిటిషన్ ను ధర్మాసనం కొట్టి వేసింది. ఈడీ కేసులకు సంబంధించిన చార్జిషీట్లు అన్ని పూర్తి కావడంతో సీబీఐ కోర్టు ముందుగా వాటిపై విచారణ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అయితే విజయసాయిరెడ్డి తో పాటు జగన్ మాత్రం.. ముందుగా సీబీఐ కేసులనే ముందుగా విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. సీబీఐ కోర్టు వారి విన్నపాన్ని తిరస్కరించింది. రెండు వేర్వేరు కేసులని.. వేర్వేరు చట్టాల కింద అభియోగాలని అందుకే… విచారణ కూడా విడివిడిగా సాగుతుందని స్పష్టం చేసింది.
అయితే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ కేసులు విచారణలో అవాస్తవమని తేలితే అప్పుడు ఈడీ కేసులు కూడా తేలిపోతాయని విజయసాయిరెడ్డి తో పాటు అక్రమాస్తుల కేసుల నిందితులు అనుకుంటున్నారు. సీబీఐ కేసుల్లో నిజం లేనప్పుడు… ఈడీ పెట్టిన కేసులు కూడా నేరం కాదని వారు వాదించాలని అనుకున్నారు. అయితే.. రెండు నేరాలు వేర్వేరని… కోర్టు స్పష్టం చేసింది. ఈడీ కేసులు ఫెరా, ఫెమా వంటి చట్టాల కింద నమోదయి ఉంటాయి. అక్రమంగా పెద్ద ఎత్తున విదేశాల నుంచి లేదా ఇండియాలో లావాదేవీలు చేయడం.. లెక్కల్లోకి రాకుండా చేయడం… నిధులను మళ్లించడం వంటి నేరాల కింద ఈడీ కేసులను నమోదు చేస్తుంది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో పెట్టుబడులు ఇలా పెద్ద ఎత్తున అక్రమ పద్దతుల్లో వచ్చాయన్న కారణంగా ఈడీ కేసులు పెట్టింది. సీబీఐ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు.. ఇతర పిటిషన్లతో విజయసాయితో పాటు ఇతర నిందితులంతా కాలక్షేపం చేస్తున్నారు. దాంతో పదేళ్లుగా జగన్ అక్రమాస్తుల కేసు ముందుకు సాగడం లేదు. ఈడీ కేసుల్లో అలాంటి చాన్సులన్నీ అయిపోవడంతో కోర్టు విచారణ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు హైకోర్టులోనూ ఎదురు దెబ్బ తగలడంతో విజయసాయిరెడ్డి అండ్ కోపై ఈడీ కేసుల విచారణ ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.