తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పధకంపై సుప్రీం కోర్టు బుదవారం విచారణ చేపట్టింది. ఆ ప్రాజెక్టు వలన దిగువనున్న కృష్ణా డెల్టా, రాయలసీమ జిల్లాలకి తీవ్ర నష్టం కలుగుతుందని, పైగా వాటి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని కనుక వాటిని నిలిపి వేయవలసిందిగా కోరుతూ విజయవాడకి చెందిన ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని ఈరోజు విచారణకి చేపట్టిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ, దీని కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానిలో తగిన నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుందని సుప్రీం కోర్టు సూచించింది.
ఆ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు కనీసం సమగ్ర నివేదికలు కూడా లేవని ఏపి ప్రభుత్వ న్యాయవాది వాదిస్తే, అవి రాష్ట్ర విభజనకి పూర్వమే ఆమోదింపబడిన ప్రాజెక్టులని, తెలంగాణా ఏర్పడిన తరువాత మొదలుపెడుతున్నంత మాత్రాన్న మళ్ళీ కొత్తగా అనుమతులు అవసరం లేదని వాదించారు.
కానీ తెలంగాణా సాగునీటి సలహాదారుగా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ రావు కొన్ని రోజుల క్రితమే అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పధకాలకి కూడా ఎటువంటి అనుమతులు లేవని, వాటికి కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా లేవని చెప్పారు. అంతే కాదు అవి లేకపోయినా పట్టించుకొనవసరం లేదని, ప్రభుత్వం ప్రస్తుత లక్ష్యాలకి అనుగుణంగా ప్రాజెక్టు చేపడితే తప్పేమీ లేదని, గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా అటువంటి విధానమే అవలంభించారని అన్నారు. కానీ వాటికి అనుమతులున్నాయని తెలంగాణా ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదిస్తోంది.
అయినప్పటికీ సుప్రీం కోర్టు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అపెక్స్ కౌన్సిల్లో ఈ సమస్యని పరిష్కరించుకోమని సూచించింది కనుక దానిని పాటించడమే మంచిది. అలాగ కాదని సుప్రీం కోర్టులో కేసు నడిపేందుకే తెలంగాణా ప్రభుత్వం మొగ్గు చూపితే దాని వలన ఆ ప్రాజెక్టులు నిలిపివేయవలసిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.