ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల అవకాశాలను అందుబాటులోకి తచ్చేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. తాజాగా ట్రయాంగిల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఓ రకంగా అర్బన్ కంపెనీ తరహా యాప్. మెట్రో నగరాల్లో అందుబాటులోఉన్న అర్బన్ యాప్ కంపెనీ ద్వారా.. సెలూన్ సర్వీస్ నుంచి ఏసీ రిపేర్ వరకూ అన్ని రకాల పనులు చేసే వాళ్లను బుక్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి యాప్ లో రిజిస్టర్ చేసుకుని పనులు దక్కించుకోవడం కాస్త క్లిష్టమైన విషయమే.
చాలా మందికి ఇంట్లో వచ్చే చిన్న చిన్న పనులకు.. రిపేర్లకు పెద్దగా పనులు తెలియని వాళ్లకు పిలిపించుకుని ఎక్కువ నష్టపోతూంటారు. అదే సమయంలో పనిలో బాగా అనుభవం ఉండి కూడా తమ గురించి ఎవరికీ తెలియకపోవడం వల్ల పనులు లేక చాలా మంది ఖాళీగా ఉంటారు. ఇలా సర్వీస్ మెన్లను… అవసరమైన వారిని కలిపి ఉంచే ఫ్లాట్ ఫాంను విస్తృతంగా అందుబాటులోకి తెస్తే.. అందరికీ మేలు జరుగుతుందని అంచనా వేశారు. కొన్ని ఇతర ప్రభుత్వాలు ట్రయాంగిల్ యాప్ ను వినియోగిస్తున్నాయి. అక్కడ యాప్ లో రిజిస్టర్ చేసుకుని సేవలు అందిస్తున్న వారికి నెలకు పాతికవేల వరకూ ఆదాయం వస్తోంది.
అందుకే ఏపీ ప్రభుత్వం కూడా ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇప్పటికే యాప్ నిర్వాహకులతో చర్చలు పూర్తయ్యాయి. రెండు నెలల్లో సేవలు ప్రారంభించడానికి అవసరమైన పనులు పూర్తి చేసి.. మార్చినుంచి అందుబాటులోకి తేనున్నారు. దీని వల్ల ప్రొఫెషనల్స్ ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది. వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న పనులపై పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.