మే 4… దర్శక రత్న దాసరి నారాయణరావు జన్మదినం. దాసరి పుట్టిన రోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకొంటుంది టాలీవుడ్. దర్శకులకు కూడా స్టార్ స్టేటస్ కల్పించిన దాసరికి ఇది సరైన నివాళే. అయితే పేరుకు మాత్రమే దర్శకుల దినోత్సవం. చాలాకాలంగా ఆ రోజు కూడా రొటీన్‌గా గడిపేయడం టాలీవుడ్ కు అలవాటుగా మారింది. నామమాత్రపు హడావుడితో `మమ` అనిపించేస్తుంటారు. అయితే.. ఈయేడాది మాత్రం మే 4ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని టాలీవుడ్ నిర్ణయించుకొంది. అందుకోసం భారీ హంగామా కూడా చేస్తోంది. దర్శకులంతా కలిసి, తమ ప్రతిష్టకు తగ్గట్టుగానే ఓ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి డైరెక్టర్స్ అసోసియేషన్ సర్వసన్నాహాలూ చేస్తోంది. మే 4న హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులంతా హాజరవుతున్నారు. ఆట పాటలూ, స్కిట్లతో… వేదికని హోరెత్తించడానికి ఇప్పటి నుంచే రిహార్సల్స్ మొదలెట్టారు. ఈకార్యక్రమానికి సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి దర్శక దిగ్గజాలు హాజరవుతున్నారు. విరాళాలు కూడా సేకరించి, భవిష్యత్తులో ఏ దర్శకుడికి ఎలాంటి అవసరం వచ్చినా, ఆదుకోవడానికి ఓ నిధిని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉంది దర్శకుల సంఘం. ఇప్పటికే ప్రభాస్ తన వంతుగా రూ.35 లక్షలు విరాళంగా ప్రకటించాడు. మిగిలిన హీరోలూ తమ సహాయ సహకారాల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడానికి నగదు పురస్కారాల్ని అందిస్తోంది. దిగ్గజ దర్శకుల్ని సన్మానించుకొంటోంది. అలా మొత్తానికి మే 4న గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తోంది టాలీవుడ్. నిజంగానే ఇది దర్శకరత్నకు ఘనమైన నివాళి అనుకోవాలి.