‘మా సినిమా బాగా వచ్చింది.. సినిమా చూసి మీరే చెప్పాలి’ అని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతుంటారు దర్శక నిర్మాతలు, హీరోలూ. అయితే ఈమధ్య ఇలా మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే సినిమా ఫలితంలో ఏమైనా తేడా వస్తే.. ట్రోల్స్, మీమ్స్‌కి బలైపోవాల్సి వస్తుంది. అందుకే… సినిమా ఎంత బాగా వచ్చినా – కాన్ఫిడెన్స్ గా మాట్లాడడానికి ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. పైగా ఈమధ్య కొంతమంది దర్శకులు తమ సినిమాల గురించి బాగా డప్పుకొట్టుకొన్నారు. ఆయా సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. అందుకే… మరింత జాగ్రత్తపడుతున్నారు.
అయితే… `ధమాకా` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు త్రినాథ రావు నక్కిన.. ఓ రేంజ్లో స్పీచ్ ఇచ్చాడు. రవితేజ పూనాడా..? సుమ ఆవహించిందా? అన్నట్టు సాగింది త్రినాథరావు స్పీచు. `సినిమా అదిరిపోయింది.. తమ్ముళ్లూ… నాలుగు బస్తాల పేపర్ ముక్కలు ఆర్డర్ చేశాను.. ఇక చూసుకోవాల్సిన పని లేదు..` అంటూ సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు. త్రినాథరావు స్పీచు చూసి రవితేజనే ఆశ్చర్యపోయాడు. సుమ అయితే.. `నాక్కూడా మాట్లాడడానికి ఏం మిగల్చలేదు` అంటూ చేతులెత్తేసింది. పైగా… స్టేజీపై స్టెప్పులు కూడా వేశాడు దర్శకుడు. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ని అనుకరించాడు. తన మాటల్లో, బాడీ లాంగ్వేజ్‌లో ఈ సినిమా పెద్ద హిట్టు కొడుతుందన్న ధీమా వ్యక్తం అవుతోంది. హిట్టయితే ఫర్వాలేదు. కానీ.. అటూ ఇటూ అయితే మాత్రం.. మోసేయడానికి మీమర్స్, ట్రోలర్స్ రెడీగా ఉంటారు. అది తెలిసి కూడా.. త్రినాథరావు నక్కిన.. ఈ స్థాయిలో మాట్లాడాడంటే.. కచ్చితంగా సినిమాలో మేటర్ ఉండే ఉంటుంది. చూద్దాం… 23న ఏమవుతుందో?