ప్రకాశం జిల్లా చీరాలలో కరణం వర్సెస్ ఆమంచి అన్న పోరు ఇప్పటిదాకా నడుస్తుందని అనుకున్నా రు. కానీ అక్కడ ట్రిపుల్ ఫైట్ ఉందని తాజాగా తేలింది. ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత వైసీపీలో చేరారు. రాజధాని బిల్లులకు ఆమోద ముద్ర వేసుకోవాలన్న ఆతృతలో మండలిలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించిన వైసీపీకి.. పోతుల సునీత చిక్కారు. ఆమె కూడా చీరాల సీటుపై ఆశలు పెట్టుకున్నారని తాజాగా వెల్లడయింది. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాలు చీరాల నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇలా వేటపాలెం మండలంలోని ఓ గ్రామంలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమంచి రాలేదు కానీ.. పోతుల సునీత వచ్చారు. వేదికపైన మరో వైసీపీ నేత పాలేటి రామారావు.. కరణంను ఆకాశానికెత్తేసారు. అంతే కాదు.. కరణం బలరాంను 2024లోనూ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
దీంతో పోతుల సునీతకు కాలిపోయింది. తాను ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వచ్చానని.. తనకు అన్యాయం జరుగుతోందని అనుకున్నారు. 2024 సంగతి ఇప్పుడెందుకని.. కరణంనే గెలిపించాలని చెప్పడానికి ఆయనెవరని వాగ్వాదానికి దిగింది. తనకు టీడీపీలోనూ అన్యాయం చేశారని.. ఇప్పుడు వైసీపీలోనూ అదే చేస్తున్నారని అన్నారు. ఆమె ఆగ్రహానికి కారణం ఉంది. పోతుల సునీత టీడీపీ తరపున పోటీ చేసి ఆమంచి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆమంచి పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు.. ఆమంచి పార్టీ మారడంతో తనకే టిక్కెట్ అనుకున్నారు.
కానీ పర్చూరులో గొట్టిపాటి రవికి టిక్కెట్ ఇవ్వడంతో కరణంకు చీరాలలో టిక్కెట్ సర్దుబాటు చేశారు. ఆయన గెలిచేశారు. దాంతో.. తన టిక్కెట్ కరణం వల్లే పోయిందని ఆమె అనుకున్నారు. ఇప్పుడు ఆమె చేరిన తర్వాత కరణం కూడా వైసీపీలో చేరారు. ఇప్పుడు.. తనకు టిక్కెట్ దక్కదని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఆమంచి .. కరణంతో పోటాపోటీగా ఉన్నారు. ఇప్పుడు పోతుల సునీత కూడా ఆశలు పెట్టుకున్నారని తేలిపోయింది.