ఒక చారిత్రక నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకుంది. ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ… ముస్లిం మహిళలకు జరిగిన చారిత్రక తప్పిదాన్ని తాము సరిదిద్దామన్నారు. సమాజంలో సమానత్వానికి ఇది మరో ముందడుగు ఇది అన్నారు. నిజానికి, ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో భాజపాకి పెద్ద మెజారిటీ అంటూ లేదు కాబట్టి, ఇక్కడ బిల్లు పరిస్థితి ఏంటనే ఉత్కంఠ కొన్నాళ్లుగా నెలకొంది. అయితే, ఎట్టకేలకు రాజ్యసభలో కూడా ఆమోద ముద్రపడింది.
రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు పడ్డాయి. అయితే, ఈ బిల్లును టోకున అన్ని పార్టీలూ ఆమోదించిన పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఓటింగ్ ప్రక్రియకు దూరమయ్యారు. ఓటింగ్ సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోపాటు ఎన్సీపీ ఎంపీలు కూడా గైర్హాజరయ్యారు. బీఎస్పీ, అన్నాడీఎంకే ఎంపీలు కూడా ఓటింగ్ లో పాల్గొనకపోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. మొత్తంగా 6 పార్టీలు ఓటింగ్ కి దూరమయ్యాయి. పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన సవరణ బిల్లు వీగిపోయింది.
సరే, రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉన్నా… ముస్లిం మహిళలకు మనదేశంలో గొప్ప ఊరట లభించినట్టే. ఎందుకంటే, కేవలం మూడుసార్లు తలాక్ అని చెప్పినంత మాత్రాన, అది కూడా నేరుగాగానీ, ఒక లెటర్ ద్వారాగానీ, చివరికి ఫోన్లోగానీ.. ఎలా చెప్పినా విడాకులు అయిపోయినట్టే అనే ఆచారం మనదేశంలో ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న మనం… ఇక్కడ మహిళల విషయంలో ఇలాంటి వివక్షాపూరితమైన ఆచారాలు అమల్లో ఉండటం సమర్థనీయం కాదు. ఇలాంటి ఇన్ స్టంట్ తలాక్ ని రద్దు చేసిన ఘనత మోడీ సర్కారుకి దక్కుతుంది అనడంలో సందేహం లేదు.