వెటరన్ వయసులోనూ… వరుస అవకాశాలతో రెచ్చిపోతోంది త్రిష. తన కెరీర్లో ఎప్పుడూ లేనంత పీక్ స్టేజ్‌ని అనుభవిస్తోంది. వరుస సినిమాలతో.. అందులోనూ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకొని బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో ఓ సినిమా ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. అందులోనూ సల్మాన్ ఖాన్ తో. సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణువర్థన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి `ది బుల్` అనే పేరు ఖరారు చేశారు.1988లో ‘ఆపరేషన్ కాక్టస్’ పేరుతో ఓ మిలిటరీ జరిగింది. మాల్దీవ్స్ అధ్యక్షుడిని రక్షించేందుకు ఇండియన్ మిలటరీ ఈ ఆపరేషన్ ని ప్లాన్ చేశారు. దీని ఆధారంగా ఈ కథని తయారు చేసుకొన్నాడు విష్ణు వర్థన్.
ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా త్రిష ఎంపికైంది. ‘కట్టా – మిట్టా’ తరవాత త్రిష ఓ బాలీవుడ్ చిత్రం చేయడం ఇదే తొలిసారి. పైగా సల్మాన్ అంటే తనకు చాలా ఇష్టం. ‘నా అభిమాన హీరో సల్మాన్. తనతో కలిసి నటించాలని వుంది’ అని త్రిష చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు ఆ కల తీరబోతోంది. కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాత. ఈమధ్య బాలీవుడ్ చిత్రాల్లో సౌత్ హీరోయిన్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. నయనతార, రష్మిక అక్కడ హిట్లు కొట్టారు. అందుకే సౌత్ కథానాయికలపై బాలీవుడ్ దృష్టి పడింది. 2024 ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. 2025 ఈద్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.