ఒకప్పుడు హీరోలతో పోలిస్తే, హీరోయిన్ల పారితోషికాలు చాలా తక్కువగా ఉండేవి. ఎంత స్టార్ డమ్ తెచ్చుకొన్నా – హీరోలకు ఇచ్చిన దాంట్లో సగం రెమ్యునరేషన్ కూడా వచ్చేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కథానాయికలు కూడా ఈ విషయంలో కథానాయకులతో పోటీకి వస్తున్నారు. హీరోలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని సార్లు హీరోల కంటే ఎక్కువగా పారితోషికాలు అందుకొంటున్నారు. ఈ విషయంలో నయనతార ఎప్పుడో రికార్డు సృష్టించేసింది. దక్షిణాదిన కోటి రూపాయలు అందుకొన్న తొలి కథానాయిక తనే. ఇప్పటికీ సౌత్‌లో తనే ఖరీదైన నాయిక. ఒక్కో సినిమాకి రూ.6 నుంచి 8 కోట్లు అందుకొంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే రూ.10 కోట్లు తప్పనిసరి.
అయితే ఈ రికార్డుని ఇప్పుడు త్రిష బ్రేక్ చేసింది. ‘విశ్వంభర’ కోసం ఏకంగా రూ.12 కోట్ల పారితోషికం అందుకొన్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే తెలుగులోనే కాదు, దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయిక… త్రిషనే. ఇప్పటి వరకూ నయన పేరుమీద ఉన్న రికార్డ్ ని త్రిష బ్రేక్ చేసినట్టే. సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష కెరీర్ మరింత జోరుగా సాగిపోతోంది. ప్రస్తుతం చిరుతో నటిస్తోంది. కమల్ హాసన్ – మణిరత్నం కాంబోలో తనే కథానాయిక. వెంకటేష్ సినిమాలోనూ కథానాయికగా త్రిష పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో బన్నీ నటించే సినిమాలోనూ త్రిషనే ఎంచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాడు. వెటరన్ హీరోలే కాదు, ఈతరం స్టార్లు కూడా త్రిష పేరే కలవరిస్తుంటే.. ఆమె పారితోషికం పెరగకుండా ఎలా ఉంటుంది మరి!